
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక G20 దేశాల 14వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి జపాన్ బయలుదేరారు. ఒసాకా వేదికగా గురు, శుక్రవారాల్లో జరిగే సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై, పరస్పర ఆర్థిక, సైనిక సహకారాలపై దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపుతారు. అమెరికా, చైనా, రష్యా ప్రెసిడెంట్లు ట్రంప్, జింగ్‌పిన్, పుతిన్‌తో విడివిడిగా సమావేశమవుతారు. జపాన్ బయల్దేరేముందు తన బ్లాగ్‌లో డిపార్చర్ స్టేట్మెంట్ రాసిన మోడీ.. ఇండియా వాయిస్ వినిపించడానికి G20 సదస్సు మంచి వేదిక అని పేర్కొన్నారు. మహిళా సాధికారత, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సమస్యలు, టెర్రరిజం, క్లైమెట్ చేంజ్ వంటి సవాళ్లపై G20 సదస్సు ఎజెండా రూపొందిందని గుర్తుచేశారు. 75వ స్వాతంత్ర్యవేడుకలు జరుపుకునే సందర్భంలోనే(2022లో) ఇండియా G20 సదస్సుకు వేదిక కానుండటం గర్వకారణమని మోడీ తెలిపారు.