జీ 20 సమ్మిట్ : వివిధ దేశాధినేతలతో సమావేశమైన మోడీ

జీ 20 సమ్మిట్ : వివిధ దేశాధినేతలతో సమావేశమైన మోడీ

ఇండోనేషియాలో జరుగుతున్న జీ 20 సమ్మిట్ చివరి రోజు మాంగ్రోవ్ ఫారెస్ట్ లో వివిధ దేశాల అగ్రనేతలు సమావేశం అయ్యారు. మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ లో భారత్ చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, మాంగ్రోవ్ ఫారెస్ట్ ను సందర్శించారు. అనంతరం మోడీతో పాటు ఇతర దేశాల నేతలు మొక్కలు నాటారు. ఇవాళ పర్యావరణం, హెల్త్ అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా ప్రధాని విడోడో, స్పెయిన్ ప్రధాని పెడ్రో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో మోడీ సమావేశం కానున్నారు. పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

మరోవైపు నిన్న జరిగిన సదస్సులో భాగంగా ప్రధాని మోడీ దేశాధినేతలతో సమావేశమయ్యారు. దౌత్య సంబంధాలు, అభివృద్ధి సహా వివిధ అంశాలపై చర్చించారు. గాల్వాన్ ఘటన తర్వాత ఫస్ట్ టైం జీ20 సమ్మిట్ లో మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోడీ  భేటీ అయ్యారు. రెండు దేశాల వ్యూహత్మక బంధంపై ఇద్దరు సమీక్ష నిర్వహించారు. సాంకేతికత సహా వివిధ కీలకరంగాలపై సమీక్ష జరిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతోపాటు రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భేటీలో చర్చించారు. అలాగే జీ20 సదస్సులో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ను మోడీ కలిశారు. సమావేశాల్లో భాగంగా మోడీ, రిషి సునాక్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. 

భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ అన్నారు. భారత్ ప్రతిభకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. భారత్, ఇండోనేషియా మధ్య బలమైన సంబంధాలున్నాయన్నారు. ప్రపంచ శాంతి కోసం అందరు కలిసి కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. మరోవైపు ఇవాళ జీ 20 ముగింపు సభలో జీ 20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు అప్పగించనుంది ఇండోనేషియా. డిసెంబర్ నుంచి జీ 20 సమ్మిట్ భారత్ నేతృత్వంలో జరుగనుంది.