ప్రియాంక గాంధీ పోటీ చేసుంటే మోదీ ఓడిపోయేవారు : రాహుల్ గాంధీ

ప్రియాంక గాంధీ పోటీ చేసుంటే మోదీ ఓడిపోయేవారు :  రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన  లోక్‌సభ ఎన్నికల్లో  తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఉంటే  ప్రధాని నరేంద్ర మోదీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించి ఉండేదని కామెంట్ చేశారు.  రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. తాను అహంకారంతో ఈ మాటలు చెప్పడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. 

ప్రధానమంత్రి రాజకీయాలు తమకు నచ్చడం లేదని ప్రజలు ఆయనకు సందేశం పంపారు కాబట్టి తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు రాహుల్ గాంధీ.  ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడతామనే సందేశాన్ని ప్రజలు గట్టిగా  పంపారని రాహుల్ గాంధీ చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఎన్నికల్లో మెరుగైన ఫలితాల విషయంలో అహం ప్రదర్శించబోమని, ప్రజాప్రయోజనాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ యూపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. అయితే, 2019, 2014 కంటే అతని గెలుపులో మెజార్టీ తగ్గింది.  2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 సీట్లకు గానూ NDA కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. మోడీ వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ 99 స్థానాలను కైవసం చేసుకుంది.