చైనా అధ్యక్షుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ

చైనా అధ్యక్షుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నిర్వహించిన విందు కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ వీడియోలో ఒకరినొకరు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో ఇద్దరూ కూడా క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు. ఉదయం అంతా తీరిక లేకుండా సెషన్స్‌లల్లో పాల్గొన్న ఇద్దరు నేతలు ఈ డిన్నర్‌కు క్యాజువల్ దుస్తులతో హాజరయ్యారు. ఇద్దరు నేతలు పలకరింపుల తరువాత- తమకు కేటాయించిన టేబుల్స్ వద్దకు వెళ్లారు.

లడఖ్ ఘర్షణ అనంతరం మోడీ, జిన్ పింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. లడఖ్ సమీపంలో వాస్తవాదీన రేఖ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య యుద్ధం జరగడం.. ఆ తరువాత చోటు చేసుకున్న ఘర్షణ, సైనికుల వీరమరణం.. వంటి పరిణామాల తర్వాత.. భారత్ చైనా పై వార్ ను ప్రకటించింది. ఆ దేశానికి చెందిన యాప్‌ల వినియోగంపై నిషేధాన్ని విధించింది. దీన్ని చైనా తప్పుపట్టడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు చెన్నై సమీపంలోని మహాబలిపురంలో మోడీ, జిన్‌పింగ్ భేటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 2019 అక్టోబర్‌లో జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‭కి వచ్చారు. ఆ భేటీ తరువాత మళ్లీ మోడీ, జిన్‌పింగ్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. మోడీ షెడ్యూల్‌లో జిన్ పింగ్ తో భేటీ ప్రస్తావన లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాలేదు.