నెగెటివిటీని వీడండి : ప్రతిపక్షాలకు మోదీ అభ్యర్థన

నెగెటివిటీని వీడండి : ప్రతిపక్షాలకు మోదీ అభ్యర్థన

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలు వ్యతిరేకతను వీడి, తమతో కలిసి పని చేయాలని అభ్యర్థించారు. శీతాకాలం ఆలస్యమైనప్పటికీ రాజకీయాల్లో వేడి పెరిగిందన్నారు. ప్రజల సంక్షేమం, దేశ ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని మోదీ చెప్పారు. సుపరిపాలన, జన హితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారినే ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. కొత్త పార్లమెంటులో సుధీర్ఘకాలం పాటు కార్యకలాపాలు సాగుతాయని ప్రధాని మోదీ అన్నారు. కాగా ఈ సెషన్ డిసెంబర్ 22, 2023న ముగుస్తుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలను సవాలు చేసేందుకు సిద్ధమైంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ ఒక నివేదికను ప్రవేశపెట్టడంపై కీలక దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్‌, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్, తెలంగాణలో విజయం సాధించడంతోపాటు, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది.