జీ20 దేశాలకు పీఎం మోడీ కీలక సూచన

జీ20 దేశాలకు పీఎం మోడీ కీలక సూచన

బెంగళూరు:ప్రపంచంలోని బలహీనవర్గాలకు గ్రూప్​ ఆఫ్​ 20 (జీ20) దేశాలు బాసటగా నిలవాలని, పేరుకుపోతున్న అప్పులను తగ్గించడంపై ఫోకస్​ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇంటర్నేషనల్​ ఫైనాన్షియల్​ సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకోకపోవడం వల్ల వాటిపై నమ్మకం కాస్త తగ్గిందని అన్నారు. రెండు రోజుల పాటు జరుగుతున్న జీ20 ఫైనాన్స్​ మినిస్టర్స్​, సెంట్రల్​ బ్యాంక్స్​ గవర్నర్స్​ మీటింగ్స్​ను (ఎఫ్​ఎంసీబీజీ) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ప్రపంచంలో కొన్ని చోట్ల యుద్ధాలు జరగడంపై విచారం ప్రకటించారు. అయితే రష్యా–ఉక్రెయిన్​ దేశాల పేర్లను ప్రస్తావించలేదు. విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని మోడీ అన్నారు. కరోనాతోపాటు అప్పుల కారణంగా ఇండియా చాలా ఇబ్బందుల పాలైందని, శ్రీలంక, పాకిస్తాన్ ​దివాలా తీశాయని చెప్పారు. సాయం కోసం ఐఎంఎఫ్​ వంటి సంస్థలను ప్రాధేయపడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సంస్థలపై నమ్మకం కొద్దిగా పోయింది. ఇవి కాలానుగుణంగా మారడం లేదు. బలహీనుల సంక్షేమం గురించి చర్చ జరగాలి. యుద్ధాల వల్ల సప్లై చెయిన్లు దెబ్బతిని ధరలు పెరుగుతున్నాయి. డెవలపింగ్ కంట్రీలపై ఇప్పటికీ కరోనా ఎఫెక్ట్​ ఉంది. మా దేశంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. భవిష్యత్ ​ఇంకా బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి. కరోనా సమయంలో డిజిటల్​ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. మేం కొన్నేళ్లలోనే అత్యంత నమ్మకమైన సమర్థవంతమైన డిజిటల్​ ఇన్​ఫ్రాను నిర్మించగలిగాం” అని ఆయన వివరించారు.

సాయంతోనే సమస్యల పరిష్కారం: నిర్మల

ఒకరికొకరు సాయం చేసుకుంటేనే  జీ20 దేశాల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ఎఫ్​ఎంసీబీజీ సమావేశంలో అన్నారు. 21 వ సెంచరీలో ఎదురవుతున్న సమస్యలను ఐఎంఎఫ్, వరల్డ్​బ్యాంక్​ వంటి ఇంటర్నేషనల్​ ఇన్​స్టిట్యూషన్లు ఎలా పరిష్కరించాలనే విషయమై జీ20 దేశాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. పేదరిక నిర్మూలన, సస్టెయినబుల్​ డెవెలప్​మెంట్​ గోల్స్​(ఎస్​డీజీలు), క్లైమేట్​ ఫైనాన్స్​పై ఫోకస్​ చేయాలని కోరారు. పోయిన  సంవత్సరం డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌‌‌‌పాస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు యాన్యువల్​ డెట్​ సర్వీస్​లో 62 బిలియన్ డాలర్లు బకాయిపడ్డాయని వెల్లడించారు. ఇది 2021లో  46 బిలియన్​ డాలర్ల కంటే తక్కువగానే ఉందని, చాలా దేశాలు డిఫాల్ట్‌‌‌‌ల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని  చెప్పారు. తక్కువ- ఆదాయ  దేశాలకు అప్పుల బాధ ఎక్కువగా ఉందని, మధ్య- ఆదాయ దేశాలనూ ఈ సమస్య పీడిస్తోందని ఆయన వివరించారు. ఈసారి జీ20 ప్రెసిడెన్సీని దక్కించుకున్న ఇండియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా కారణంగా... అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించగల మార్గాల కోసం చర్చిస్తోంది. 

గ్లోబల్​ ఎకానమీకి ఇంకా సమస్యలున్నయ్​: శక్తికాంత దాస్​

గ్లోబల్​ ఎకానమీ పరిస్థితి ఇటీవల కాస్త బాగుపడ్డప్పటికీ, ఇంకా సమస్యలు ఉన్నాయని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అన్నారు. జీ20 దేశాల  ఆర్థిక వ్యవస్థలకు  ఎదురవుతున్న ఇబ్బందులను సమష్టిగా పరిష్కరించుకుందామని అన్నారు. ‘‘గ్లోబల్​ ఎకానమీ పూర్తిగా రెసిషన్​లోకి వెళ్లిపోతుందన్న భయాలు తొలగిపోయాయి. వృద్ధి నెమ్మదించడం, కొద్దిపాటి రెసిషన్​ ఇప్పుడున్న సమస్యలు. మనముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. మనందరం కలిసి ఈ సమస్యలను ఎదుర్కోవాలి. గ్లోబల్​ వాల్యూ  చెయిన్లకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చర్యలు ఉండాలి”అని శక్తికాంత దాస్​ అన్నారు.