అమ్మ పేరిట మొక్క నాటండి: మోదీ

అమ్మ పేరిట మొక్క నాటండి: మోదీ
  • మన్ కీ బాత్​లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు 
  • ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని సక్సెస్​ చేయండి
  • మా ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించినందుకు ప్రజలకు థ్యాంక్స్
  • అరకు కాఫీ సహా భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్
  • ఇండియన్ కల్చర్, ప్రొడక్టులు విశ్వవ్యాప్తం అవుతున్నాయన్న మోదీ

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి గౌరవార్థం ఒక మొక్కను నాటాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అమ్మ పేరిట మొక్కను నాటి, ఆమెతో ఫొటో దిగి లేదా ఆమె ఫొటోతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరిట ఒక మొక్క)’ ప్రచారాన్ని ప్రారంభించి, తన తల్లి పేరిట మొక్క నాటానని చెప్పారు. ఈ క్యాంపెయిన్ ‘పుడమి తల్లి’ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని, ఇందులో పాల్గొంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సంతోషం వ్యక్తంచేశారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలు అంతులేని విశ్వాసం ప్రదర్శించారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 65 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పా రు. ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తిరిగి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు వెళ్లనున్న ఇండియన్ అథ్లెట్స్​కు మోదీ గ్రీటింగ్స్ తెలిపారు. మన అథ్లెట్లను ప్రోత్సహించడం కోసం అందరూ ‘చీర్4భారత్’ హ్యాష్ ట్యాగ్​తో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు.
 
మన కల్చర్ విదేశాల్లో విస్తరిస్తోంది.. 

మన దేశంతో ముడిపడి ఉన్న విధానాలు, ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఇండియన్ కల్చర్ ఖ్యాతి నలుదిశలా విస్తరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కువైట్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంట పాటు హిందీ ప్రోగ్రాం ప్రసారమవుతోంది. ఇందులో ఇండియన్ కల్చర్ కు సంబంధించిన అంశాలూ ఉంటున్నాయి. ప్రధానంగా భారతీయ కళలు, సినిమాలపై చర్చలు పాపులర్ అవుతున్నాయి. ఇందులో అక్కడి భారతీయులే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొంటున్నారు” అని ఆయన తెలిపారు. ‘‘తుర్కుమెనిస్తాన్​లో ఈ ఏడాది మే నెలలో 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆ దేశ అధ్యక్షుడు ఆవిష్కరించారు. వాటిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉండటం మనకు గర్వకారణం. యోగా డే సందర్భంగా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగా కార్యక్రమాలను నిర్వహించాయి” అని మోదీ వివరించారు. 

రేడియోలో సంస్కృత బులెటిన్​కు 50 ఏండ్లు..  

ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత బులెటిన్​కు 50 ఏండ్లు పూర్తి కావడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతం భారతీయ జ్ఞానం, సైన్స్ పురోగతిలో పెద్ద పాత్రను పోషించిందన్నారు. మన రోజువారీ జీవితాల్లో సంస్కృత వినియోగం పెరగాలని ఆకాంక్షించారు. బెంగళూరులోని కుబ్బన్ అనే పార్కులో ‘సంస్కృత్ వీకెండ్’ పేరుతో సమస్థి గుబ్బి అనే మహిళ ప్రతి ఆదివారం స్థానికులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని మోదీ మెచ్చుకున్నారు.

అరకు కాఫీకి విదేశాల్లో డిమాండ్ 

ఇండియా నుంచి ఎన్నో ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, వీటికి రోజురోజుకూ విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని మోదీ చెప్పారు. ఇలాంటి ఉత్పత్తుల్లో ఏపీలోని అరకు లోయలో పండించే కాఫీ కూడా ఉందన్నారు. చక్కటి రుచి, సువాసనతో కూడిన అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డులు సైతం వచ్చాయని చెప్పారు. పుల్వామాలో పండిన స్నో పీస్(బఠాణీలు) లండన్​కు తొలిసారిగా ఇటీవల ఎగుమతి అయ్యాయన్నారు. కేరళలోని అత్తపది గిరిజన మహిళలు చేతితో తయారుచేసే కర్తుంభి గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారు.