పదేండ్లలో మస్తు మంది డాక్టర్లు

పదేండ్లలో మస్తు మంది డాక్టర్లు    పేదోళ్లకూ అందుబాటులో ఉండేలా మెడికల్​ చదువులు
    ఆరోగ్యంగా లేకుంటే ఎన్ని లక్షల బెడ్లున్నా సరిపోవు
    అందరూ పరిశుభ్రతను అలవాటు చేస్కోవాలె
    రోజూ నడవాలే.. ఎక్సర్​సైజ్​, యోగా చెయ్యాలని సూచన
    ఇంటింటా షుగర్​ బాధితులున్నారని ఆందోళన

భుజ్​: జిల్లాకో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దాని వల్ల రాబోయే పదేండ్లలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు దేశంలో తయారవుతారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మెడికల్​ చదువులు పేదోళ్లకూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కువ సంఖ్యలో ఎయిమ్స్​, సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్​లోని కచ్​ జిల్లాలో ఉన్న భుజ్​లో 200 బెడ్ల కేకే పటేల్​ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని వర్చువల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశమంతటా ఆస్పత్రులను అప్​గ్రేడ్​ చేస్తున్నామని చెప్పారు. అయితే, ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోకుంటే ఎన్ని లక్షల బెడ్లను ఏర్పాటు చేసినా సరిపోవని, కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలందరూ పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని, ఎక్సర్​సైజులు, యోగా చేయాలని ప్రధాని సూచించారు. ఇంటా..బయటా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే జబ్బులు మన దగ్గరకు రావన్నారు. అసలు ఆస్పత్రుల గడప తొక్కే అవసరం రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. 

బరువు ఎక్కువైతోంది.. షుగర్​ పెరుగుతున్నది

ప్రస్తుతం సొసైటీలో ప్రతి ఒక్కరిని లైఫ్​స్టైల్​ జబ్బులు వేధిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఊబకాయ సమస్య పెరిగిందని, షుగర్​ బాధితులు ఎక్కువైతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు షుగర్​ బాధితులున్నారని అన్నారు. ఆ ఒక్క చక్కెర వ్యాధితోనే మిగతా జబ్బులన్నీ వస్తున్నాయని, అది రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ నడవడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచం మొత్తం మన యోగా, పసుపుపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆయుర్వేదంపై ప్రపంచ దేశాలు నమ్మకం పెంచుకోవడంతో మన దేశంలో పసుపు ఎగుమతులు పెరిగాయని చెప్పారు. మన శరీరం బలంగా ఉండబట్టే కరోనాపై మనం విజయం దిశగా వెళ్తున్నామని, కచ్చితంగా కరోనాపై గెలుస్తామని అన్నారు. అయినా కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని, నిర్లక్ష్యం పనికిరాదని ప్రజలకు సూచించారు. 

జిల్లా, బ్లాక్​ లెవెల్​లోనూ ఆస్పత్రులు

ప్రతి జిల్లాలోనూ కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్​ సేవలు అందిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఆయుష్మాన్​ భారత్​, ప్రధానమంత్రి జన ఔషధి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశామని, మందులు తక్కువ ధరకే దొరుకుతున్నాయని తెలిపారు. దాని వల్ల ఆరోగ్య రంగంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు. ఆదా అయిన డబ్బుతో వెల్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ యోజనను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల్లో భాగంగా జిల్లా, బ్లాక్​ లెవెల్​లోనూ హెల్త్​కేర్​ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడానికి వీలవుతుందన్నారు. ఇవి కేవలం ట్రీట్​మెంట్​కే పరిమితం కావని, సోషల్​ జస్టిస్​ను ప్రమోట్​ చేసేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. పేదోళ్లకూ వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. చికిత్సకయ్యే ఖర్చు లేకుంటే పేదోళ్లకు బాధలే ఉండవన్నారు.

జిల్లాకో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేస్తం.  దాని వల్ల రాబోయే పదేండ్లలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు దేశంలో తయారవుతారు. మెడికల్​ చదువులు పేదోళ్లకూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నం. ఎక్కువ సంఖ్యలో ఎయిమ్స్​, సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నం.  దేశమంతటా ఆస్పత్రులను అప్​గ్రేడ్​ చేస్తున్నం.  ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోకుంటే ఎన్ని లక్షల బెడ్లను ఏర్పాటు చేసినా సరిపోవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు  పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి. ఎక్సర్​సైజులు, యోగా చేయాలి. 
‑ ప్రధాని నరేంద్ర మోడీ