
- డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్న నేతలు
- ఈ నెల 5, 6 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
- హాజరుకానున్న నడ్డా, బీఎల్ సంతోష్
- 10న ఉమ్మడి ఆదిలాబాద్‌కు అమిత్ షా
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ వరుస సభలతో రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. మూడు రోజుల్లో రెండు సభల్లో ఆయన పాల్గొనడం, వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డును ప్రకటించడం, సమ్మక్క–సారక్క పేరిట ట్రైబల్ వర్సిటీని ప్రకటించడం.. రాష్ట్ర బీజేపీకి నూతనోత్తేజాన్ని తెచ్చిపెట్టింది. బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై నేరుగా ప్రధాని మోదీ అటాక్ చేయడంతో రాష్ట్ర ప్రజల్లోనూ బీజేపీపై మరింత నమ్మకాన్ని పెంచిందని కమలం నేతలు అంటున్నారు.
ఇదే ఉత్సాహంతో ముందుకు..
ఆదివారం మహబూబ్ నగర్లో, మంగళవారం నిజామాబాద్ లో ఇటు అధికారిక, అటు పార్టీ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రానికి వరాలు కురిపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయాన్ని ఆయన తన చేతలతో చూపించారు. మహబూబ్ నగర్ వేదికగా రూ. 13,545 కోట్ల అభివృద్ధి పనులకు, నిజామాబాద్ వేదికగా రూ. 8 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఒక్క రోజు తేడాతోనే రూ. 21 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని ఓపెనింగ్స్ చేయడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎంతటి చిత్తశుద్ధిని చూపిస్తున్నదనే విషయం ప్రజలకు తెలియజేసినట్లయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
రాష్ట్రంలో బీజేపీకి అసలైన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ అనే విషయాన్ని మోదీ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబపాలన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించడాన్ని చూస్తే అసెంబ్లీ ఎన్నికలను పార్టీ ఎంత సీరియస్ గా తీసుకున్నదనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే జోష్‌తో ముందుకు వెళ్తామని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్ శివారులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు వారు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నెల 5న మొదటి రోజు కార్యవర్గ సమావేశాలకు బీఎల్ సంతోష్, ఈ నెల 6న ముగింపు సమావేశాలకు జేపీ నడ్డా హాజరవుతారు.
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన, పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా ఫైనల్ చేయడం వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. ఈ రెండు రోజుల సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 మంది ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 10న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు అగ్ర నేతలంతా రాష్ట్రంలో పర్యటనలు చేపడుతుండటం రాష్ట్ర బీజేపీకి మరింత ఊతమిస్తున్నది.