సొంత కల్చర్ నే సిగ్గుచేటనుకున్నరు:ప్రధాని మోదీ

సొంత కల్చర్ నే సిగ్గుచేటనుకున్నరు:ప్రధాని మోదీ
  • గత పాలకులు మన సంస్కృతిని నిర్లక్ష్యం చేశారు: ప్రధాని
  •  
  • గత పదేండ్లలోనే అస్సాంలో శాంతి నెలకొంది 
  • గువాహటిలో రూ.11,600 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

గువాహటి: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ సొంత కల్చర్​ను, గతాన్ని సిగ్గుచేటుగా భావించారని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. రాజకీయ కారణాలతోనే ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్లక్ష్యంచేశారని విమర్శించారు. మూలాలను తెగ నరుక్కుని, గతాన్ని మరిచిపోయి పూర్తిగా చెరిపేసుకుంటే ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. ఆదివారం అస్సాంలోని గువాహటిలో రూ.11,600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. కామాఖ్య టెంపుల్ కారిడార్ ప్రాజెక్టును కేంద్రం రూ.498 కోట్లతో అభివృద్ధి చేయనుందని, ఈ శక్తిపీఠాన్ని అభివృద్ధి చేసిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారని ఆయన తెలిపారు. కామాఖ్య టెంపుల్ కారిడార్ ఈశాన్య రాష్ట్రాలకు ఒక గేట్ వేలా మారుతుందన్నారు. వేల ఏండ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఇలాంటి టెంపుల్స్ మన సంస్కృతికి నిదర్శనాలుగా నిలిచాయన్నారు. ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు శిథిలాలుగా మారాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈశాన్య అభివృద్ధికి నాదే గ్యారంటీ

అభివృద్ధి, వారసత్వ పరిరక్షణ అన్నదే బీజేపీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ సర్కార్ కు అతిముఖ్యమైన పాలసీ అని మోదీ చెప్పారు. సంస్కృతిని కాపాడే విషయంలో గత పదేండ్లలోనే పరిస్థితి ఎంతో మారిందన్నారు. విశ్వాసాలు, ఆధ్యాత్మికత, చరిత్ర వంటివి ఆధునిక కాలంతో అనుసంధానమై ఉన్న గొప్ప ప్రాంతం అస్సాం అని అన్నారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ప్రాజెక్టులతో ఈశాన్యానికి మాత్రమే కాకుండా సౌత్ ఆసియాకు కూడా కనెక్టివిటీని పెంచుతుందన్నారు. ‘‘ఈశాన్య ప్రాంతం సౌత్ ఆసియాతో సమానంగా అభివృద్ధి చెందాలని నేడు ఇక్కడి యువత కోరుకుంటున్నారు. మీ స్వప్నమే మోదీ సంకల్పం. మీ కలను సాకారం చేయడంలో ఏ ఒక్క అవకాశాన్నీ మోదీ వదులుకోడు. ఇది మోదీ గ్యారంటీ” అని ప్రధాని హామీ ఇచ్చారు.

7 వేల మంది గన్స్ వదిలేశారు 

అస్సాంలో గత పదేండ్లలోనే శాంతి నెలకొందని, 7 వేలకుపైగా మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిశారని ప్రధాని చెప్పారు. పదికి పైగా శాంతి ఒప్పందాలు కుదిరాయన్నారు. గతంలో తాను బీజేపీ కోసం అస్సాంలో పనిచేశానని, అప్పుడు గువాహటిలో రోడ్డు దిగ్బంధాలు, బాంబు పేలుళ్లను స్వయంగా చూశానన్నారు. ఇప్పుడవన్నీ గత చరిత్రలో కలిశాయన్నారు. అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను ఉపసంహరించుకున్నామని ఆయన తెలిపారు. గత దశాబ్దకాలంలో ఈశాన్య ప్రాంతాన్ని రికార్డ్ స్థాయిలో పర్యాటకులు సందర్శించారని చెప్పారు. చరిత్రాత్మక స్థలాల అభివృద్ధికి కొత్త స్కీంను తెస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్​లో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత పదేండ్లలో నార్త్ ఈస్ట్​లో అభివృద్ధి పనుల కోసం ఖర్చును నాలుగు రెట్లు పెంచామన్నారు. గతంలో అస్సాం నుంచి ఎన్నికైన వ్యక్తి ప్రధాన మంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి అభివృద్ధి పనులేవీ చేయలేదన్నారు. అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్​పై ఆయన ఈ మేరకు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

విపాసనతో స్ట్రెస్ మాయమైతది 

రోజువారీ జీవితాల్లో ఒత్తిడి, దు:ఖం వంటివి విపాసన మెడిటేషన్ చేస్తే మాయం అవుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు విపాసనను వైరాగ్యానికి సంబంధించిన విషయంగా మాత్రమే చూసేవారని, కానీ నేడు అది వ్యక్తిత్వ వికాసంలో భాగంగా మారిందన్నారు. ఆదివారం ముంబైలో ప్రముఖ విపాసన టీచర్ ఎస్ఎన్ గోయెంకా శత జయంతి వేడుకల కార్యక్రమంలో ప్రధాని వర్చువల్ గా మాట్లాడారు. విపాసన టెక్నిక్ అనేది ప్రాచీన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అని అన్నారు. ఎఎస్ఎన్ గోయెంకా ‘వన్ లైఫ్ వన్ మిషన్’ నినాదానికి నిదర్శనమని కొనియాడారు. ఆయన బోధనలు ప్రజల్లో స్ఫూర్తిని నింపి సమాజ సంక్షేమానికి తోడ్పడ్డాయని చెప్పారు.