ఎల్కే అద్వానీని కలిసిన మోదీ..ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

ఎల్కే అద్వానీని కలిసిన మోదీ..ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ బీజీపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో సమావేశమయ్యారు. అద్వానీ ఇంటికెళ్లిన మోదీ కాసేపు ఆయనతో మాట్లాడారు. పుష్ఫగుచ్చం ఇచ్చి అద్వానీ ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. జూన్ 9న జరిగే ప్రమాణ స్వీకారానికి అద్వానీని ఆహ్వానించారు మోదీ. అద్వానీ ఇంటి నుంచి మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి  బయల్దేరారు మోదీ.

 ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష  సమావేశంలో ఎన్డీయే కూటమి ఈ మేరకు ఎన్నుకుంది. ఎన్డీయే పక్ష నేతగా మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్  ప్రతిపాదించగా అమిత్ షా, గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు, నితీశ్ బలపరిచారు. 

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత మోదీ శనివారమే ప్రమాణం చేస్తారని వార్తలు రాగా.. తాజాగా ఆ ప్రోగ్రామ్​ను ఆదివారం సాయంత్రానికి మార్చారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌‌‌‌లో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండో నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఈసారి దక్షిణాసియా దేశాల అధినేతలు హాజరవుతున్నారు.