కాంగ్రెస్ నిరసనలపై ప్రధాని మోడీ సెటైర్ 

 కాంగ్రెస్ నిరసనలపై ప్రధాని మోడీ సెటైర్ 

పానిపట్/న్యూఢిల్లీ : బ్లాక్ మ్యాజిక్ తో ప్రతిపక్ష పార్టీకి ఉన్న చెడ్డ రోజులు పోవని, వాళ్లు మళ్లీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేరని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఇటీవల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు వేసుకుని నిరసనలు తెలపడంపై ప్రధాని ఈ మేరకు సెటైర్ వేశారు. బుధవారం హర్యానాలోని పానిపట్ లో రూ. 900 కోట్ల వ్యయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంటును మోడీ వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 5న కొందరు ‘బ్లాక్ మ్యాజిక్’ను వ్యాప్తి చేయాలని చూశారు. కానీ నల్ల దుస్తులు వేసుకుని నిరసనలు చేపట్టినంత మాత్రాన ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేరన్న సంగతి వాళ్లకు తెలియదు” అని అన్నారు. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటిస్తే దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు అడ్డంకిగా మారుతుందని, పన్నులు కట్టే ప్రజలపై భారమవుతుందన్నారు.  

ఇథనాల్​తో రూ. 50 వేల కోట్లు ఆదా 
పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపటం ద్వారా రూ. 50 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్లు ప్రధాని మోడీ తెలిపారు. గడిచిన ఏడెనిమిదేళ్లలో వచ్చిన ఈ ఆదాయమంతా రైతులకు అందిందన్నారు. పానిపట్‌లో నిర్మించిన ఇథనాల్ ప్లాంట్ హర్యానా, ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్ట్ లక్షల టన్నుల వరి గడ్డిని, పంట వ్యర్థాలను ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఇలా పంట వ్యర్థాల ద్వారా రైతులకు కూడా ఆదాయం వస్తుందన్నారు. ఈ ప్లాంట్ జీవ ఫ్యూయెల్ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంతో పాటు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో 75% ఇండ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయవచ్చని చెప్పారు.  

మోడీకి జైరాం కౌంటర్ 
ప్రధాని మోడీ నల్ల దుస్తుల పేరిట అర్థంలేకుండా మాట్లాడారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కౌంటర్ ఇచ్చారు. మోడీ నల్ల దుస్తుల్లో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. బ్లాక్ మనీని తేవడం గురించి ఏమీ చేయరని.. కానీ నల్ల దుస్తులను పట్టుకుని పాయింట్ లెస్ గా మాట్లాడుతున్నారని అన్నారు.