ఫ్యాషన్​లో ప్రపంచానికే భారత్ దిక్సూచి: మోడీ

ఫ్యాషన్​లో ప్రపంచానికే   భారత్ దిక్సూచి: మోడీ
  • ప్రాచీన కాలంలోనే మన దేశంలో మోడ్రన్ దుస్తులు: మోదీ 
  • కోణార్క్ టెంపుల్‌‌‌‌‌‌‌‌ విగ్రహాలపై  మినీ స్కర్టులే సాక్ష్యం
  • ఫస్ట్ నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని  
  • విదేశాల్లో ఇండియన్ వేర్ ను ప్రోత్సహించాలని పిలుపు

న్యూఢిల్లీ :  చాలా మంది మినీ స్కర్టులను ఆధునికతకు చిహ్నంగా భావిస్తారని, కానీ కోణార్క్  సూర్య దేవాలయానికి వెళ్తే అక్కడి ఆలయ గోడలపై మినీ స్కర్టులు ధరించి ఉన్న శిల్పాలు కనిపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాకుండా ఆ విగ్రహాల చేతుల్లో పర్సులు ఉండడం కూడా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. పురాతన కాలం నుంచే మన దేశంలో ఆధునికత ఉందని అనడానికి కోణార్క్  సూర్య దేవాలయమే నిదర్శనమన్నారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్  మండపంలో నిర్వహించిన ఫస్ట్ నేషనల్  క్రియేటర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న ఆధునిక ధోరణులను కోణార్క్  సూర్య దేవాలయంలో ఉన్న పురాతన శిల్పాలతో పోల్చారు. భారత్ లో ఆధునికత పురాతన కాలం నుంచే ఉందన్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ కు సంబంధించిన ఆధునికత మన దేశంలోనే పుట్టిందని, ట్రెండ్  క్రియేట్  చేయడంలో పురాతన కాలం నుంచి మన దేశమే ముందుందని ఆయన చెప్పారు. ‘‘వందల ఏండ్ల క్రితమే మన ఆలయాల గోడలపై మన శిల్పకారులు ఫ్యాషన్ కు సంబంధించిన శిల్పాలు చెక్కారు. ఆ శిల్పకారులకు ఫ్యాషన్ కు సంబంధించిన జ్ఞానం ఉందన్న విషయం ఆ శిల్పాలను చూస్తే అర్థమవుతుంది” అని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే రెడీమేడ్  దుస్తుల ట్రెండ్ పైనా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియన్  వేర్ ను బలంగా ప్రమోట్  చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్ లో ఇండియన్  ఫ్యాషన్  అభివృద్ధి చెందడానికి మంచి వాతావరణం ఉంది. ప్రపంచానికి మన దేశ ప్రత్యేకతను చాటిచెప్పే సంప్రదాయ దుస్తులపై ఫోకస్  పెట్టాలి” అని ప్రధాని సూచించారు. 

క్రియేట్  ఆన్  ఇండియా..

‘క్రియేట్ ఆన్ ఇండియా మూవ్ మెంట్’ ను ప్రారంభించాలని కంటెంట్  క్రియేటర్లను ప్రధాని కోరారు. కంటెంట్  క్రియేటర్లు దేశ డిజిటల్  అంబాసిడర్లని, అంతేకాకుండా ‘వోకల్  ఫర్  లోకల్’ కూ ప్రతినిధులని ఆయన కొనియాడారు. ‘‘అందరం కలిసి ‘క్రియేట్  ఆన్  ఇండియా మూవ్ మెంట్’ ను ప్రారంభిద్దాం. ఈ ఉద్యమంతో భారత్ స్టోరీలు, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపద వంటి వాటిని యావత్  ప్రపంచంతో పంచుకుందాం” అని మోదీ పిలుపునిచ్చారు. భారత్  గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రపంచ దేశాల్లో పెరుగుతున్నదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో యూఎన్  భాషలైన జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్​  తదితర ల్యాంగ్వేజెస్ లో కంటెంట్ ను డెవలప్  చేయాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కంటెంట్  క్రియేటర్లు కంటెంట్ లో నారీశక్తిని భాగం చేయాలన్నారు. 

కంటెంట్  క్రియేటర్ అవార్డుల కోసం 1.5 లక్షల నామినేషన్లు

కంటెంట్  క్రియేటర్స్  అవార్డుల ప్రదానం ఇదే తొలిసారి. అవార్డుల కోసం మొత్తం 20 కేటగిరిల్లో 1.5 లక్షల నామినేషన్లు వచ్చాయి. చివరకు 23 మందిని విజేతలుగా సెలెక్ట్  చేశారు. వారిలో ముగ్గురు ఇంటర్నేషనల్  క్రియేటర్లు కూడా ఉన్నారు. అవార్డులు అందుకున్న వారిలో రణ్​వీర్  అల్లాహ్ బదియా (డిస్ రప్టర్  ఆఫ్  ద ఇయర్), జయ కిశోర్  (బెస్ట్  క్రియేటివ్  ఫర్  సోషల్  చేంజ్), లక్ష్య దబాస్  (మోస్ట్  ఇంపాక్ట్ ఫుల్  అగ్రి క్రియేటర్), టాంజానియాకు చెందిన కిరి పాల్, అమెరికాకు చెందిన డ్రివ్  హిక్స్, జర్మనీకి చెందిన కాస్సాండ్ర స్పిట్ మన్ (బెస్ట్ ఇంటర్నేషనల్  క్రియేటర్  అవార్డ్) తదితరులు ఉన్నారు. ఇక మహిళల కేటగిరీలో జాహ్నవి సింగ్ (హెరిటేజ్  ఫ్యాషన్  ఐకాన్  అవార్డ్), శ్రద్ధ (బెస్ట్  క్రియేటివ్  క్రియేటర్) తదితరులు ఉన్నారు.