ప్రధాని రేసులో మోడీకి పోటాపోటీగా మమత, మాయ

ప్రధాని రేసులో మోడీకి పోటాపోటీగా మమత, మాయ

హంగ్ సభ ఊహాగానాలతో తెరపైకి పేర్లు

తృణమూల్, బీఎస్పీలకు ఎక్కువ సీట్లొస్తే చాన్స్

మోడీకి మాటకు మాట బదులిస్తున్న ఇద్దరు

మమతకు మద్దతుగా పవార్, కుమారస్వామి

మాయావతిని ప్రతిపాదిస్తున్న అఖిలేశ్, పవన్

23 తర్వాతే అభ్యర్థిపై నిర్ణయమన్న మమత

వెలుగు బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో ఆరు విడతలు పూర్తై ఒక్క దశ మాత్రమే మిగిలింది. పోలింగ్ తీరును చూశాక బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో ప్రధాని పదవి రేసులో చాలామంది నేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశచరిత్రలోనే తొలిసారి ఇద్దరు మహిళా నేతల పేర్లు ప్రధాని పదవి రేసులో ఉండడం ఆసక్తి రేపుతోంది. ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలకు మాటకుమాట బదులిస్తున్న ఈ ఇద్దరు మహిళలు బీఎస్పీ అధినేత మాయావతి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ. జాతీయ పార్టీల తర్వాత ఎక్కువ సీట్లు గెలిచే అవకాశమే వారిని రేసులో ముందు నిలబెడుతోంది.

మాయావతి: కొత్త చరిత్ర

ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి ఈసారి రాజకీయ జీవితంలోనే కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2014 పార్లమంట్, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో చిరకాల ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీతో దోస్తీ చేశారు. మహాకూటమిగా భారీ సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే ప్రచారంలో మోడీతో సై అంటే సై అంటున్నారు. మోడీ విమర్శలతో విరుచుకుపడుతుంటే ఒక మాటకు రెండు మాటలు బదులిస్తున్నారు. ప్రధాని కావాలన్న లక్ష్యాన్ని పలుమార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు.

గత ఎన్నికల్లో యూపీలో 80 ఎంపీ సీట్లకు 71 సాధించిన బీజేపీకి ఈసారి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. విపక్షాలు మహాకూటమిగా మారడం వల్ల భారీగా సీట్లకు గండిపడుతుందన్న అంచనాలున్నాయి. 38 సీట్లలో పోటీచేస్తున్న బీఎస్పీ 25 నుంచి 30 సీట్ల వరకు గెలుస్తుందని మాయావతి భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించే అవకాశం బీఎస్పీకి ఉండడంతో తాను ప్రధాని రేసులో ఉంటానని నమ్ముతున్నారు. 2009 ఎన్నికల్లో మాయావతి 21 ఎంపీ సీట్లు సాధించారు. ఈసారి ఎస్పీతో జట్టుకట్టడం వల్ల సంప్రదాయ ఓట్ల కలయికతో భారీగా సీట్లు గెలుస్తామని అంచనాలు వేస్తున్నారు. ఈ అంచనాలే ఆమె పేరును బలంగా వినిపించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీలు ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాయి. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పరిస్థితి దారుణంగా మారింది. ఒడిశాలో మొత్తం సీట్లు 21 కావడంతో బీజేడీ స్వీప్ చేసినా 20లోపు మాత్రమే సాధించే అవకాశం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించే అవకాశం బెంగాల్ లో మమతా బెనర్జీకి, యూపీలో మాయావతికి మాత్రమే కనిపిస్తోంది. అందుకే బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీనీ మాయావతి వదిలిపెట్టడం లేదు. మహాకూటమిలో కాంగ్రెస్ ను కలుపుకోవడానికి అఖిలేశ్ సానుకూలంగా ఉన్నా మాయ ఒప్పుకోలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్లకు మద్దతిస్తూనే యూపీలో ఆ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారామె.

బీఎస్పీకి యూపీతోపాటు చాలా రాష్ట్రాల్లో మంచి ఓటు బ్యాంకు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి పదవులను దళిత నేతలు చేపట్టినా ప్రధాని అయ్యే అవకాశం మాత్రం రాలేదు. ఇవన్నీ మాయావతికి కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ మద్దతుతోనే కాకుండా అవసరమైతే బీజేపీ సహకారంతో అయినా ఆమె ప్రధాని అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి 200 లోపు సీట్లు వస్తే ప్రధానిగా మాయావతికి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో బీజేపీ మద్దతుతోనే ఆమె రెండుసార్లు యూపీ సీఎం అయ్యారు. ఇక యూపీఏ కూటమిగా కాంగ్రెస్ అధికారం అందుకోలేని పక్షంలో బీజేపీని అడ్డుకోవడం కోసం ఇతర పక్షాలు మాయావతిని ప్రతిపాదిస్తే సహకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమె ప్రధాని అభ్యర్థిత్వానికి ఇప్పటికే అఖిలేశ్ యాదవ్ మద్దతు ప్రకటించారు. యూపీ నుంచి ప్రధాని అవుతారంటే తనకంటే సంతోషపడేవాళ్లు ఎవరూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే మాయావతిని పలుమార్లు కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆమె ప్రధాని కావాలని ప్రకటించారు.

కాంగ్రెస్ సీట్లను బట్టే చాన్స్

బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ చాలా తక్కువ సీట్లు వచ్చినప్పుడే మాయావతికిగానీ, మమతకుగానీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ 200 సీట్లలోపు పరిమితమై, కాంగ్రెస్ కూడా 130 సీట్లు దాటకపోతే అప్పుడు మిగిలిన పక్షాలన్నిటికీ కలిపి 200 సీట్ల వరకు ఉంటాయి. దీంతో మూడో పక్షం నుంచి ప్రధాని అయ్యే అవకాశం వస్తుంది. అందులో మాయావతి, మమత బలమైన పక్షాలుగా ఉంటారు కాబట్టి వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఇద్దరు నేతలు ఎవరి మాటా వినరన్న అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు ఎవరిని ప్రధానిని చేసినా మిగతా ప్రాంతీయ పార్టీల డిమాండ్ల ప్రకారం పనిచేస్తారా? అన్నది ఆ పార్టీల నేతలు సీరియస్ గా ఆలోచించే అవకాశముంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ హయాంలో తక్కువ సీట్లు ఉన్నా దేవెగౌడ, గుజ్రాల్ కు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. వారిద్దరూ సౌమ్యులు కాబట్టే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు మాయావతి, మమత విషయంలో ప్రాంతీయ పార్టీలను ఎలా ఒప్పిస్తారన్నదే వారి భవిష్యత్ ను నిర్ణయించనుంది.

మమతా బెనర్జీ
యాంటీ మోడీ బ్రాండ్

మూడేళ్లుగా దేశంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాజకీయం నడిపించిన నేతగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు. ఈ బ్రాండ్ తోనే ఆమె పేరు ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. కోల్ కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యవహారంలో కేంద్రాన్ని ధిక్కరించి సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకునేలా చేశారు. ఈ నిర్ణయంతో కేంద్రంలో మోడీతో నేరుగా ఢీ అంటే ఢీ అన్నారు. గత లోక్ సభలో కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే తర్వాత 34 ఎంపీ సీట్లతో తృణమూల్ నాలుగో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకుంటామని ఆమె ధీమాగా ఉన్నారు. బెంగాల్ లో దీదీకి వ్యతిరేకంగా లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నా ఆమెకే ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలున్నాయి. తృణమూల్ 30 నుంచి 35 సీట్లు గెలిస్తే బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుంది. అప్పుడు తానే ప్రధాని పదవి రేసులో ముందుంటానని మమత భావిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు తప్ప ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. కమ్యూనిస్టులు సాధించే సీట్లు ఆమెను అడ్డుకునే స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆమెకు బహిరంగంగా మద్దతు పలికారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా అవకాశం వస్తే మమత మంచి ప్రధాని అవుతారంటూ కితాబిచ్చారు. ఇప్పటివరకు మమత నేరుగా తాను ప్రధాని రేసులో ఉన్నట్లు చెప్పుకోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాకే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని ఆమె అంటున్నారు. డీఎంకే లాంటి పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించినా ఆమె సీరియస్ గా తీసుకోలేదు. రాహుల్ కంటే సోనియానే తాను అభిమానిస్తాననీ, ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని మమత వ్యాఖ్యానించారు. శరద్ పవార్, చంద్రబాబు, కేసీఆర్, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు బీజేపీ మిత్రపక్షమైన శివసేనతోనూ ఆమెకు మంచి సంబంధాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటైతే తనకే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని మమత భావిస్తున్నారు.