
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం సమ్మాన్ నిధి పథకాన్ని యూపీ గోరఖ్ పూర్ లో మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద ఆదివారం తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.100 కోట్లను కేంద్ర వ్యవసాయశాఖ జమ చేసింది. 5 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ పథకాన్ని ఆదివారం ప్రధాని మోడీ గోరఖ్ పూర్ లో ప్రారంభించిన తరవాత ఈ నిధుల జమ మొదలైంది. రాష్ట్రంలో జిల్లా వ్యవసాయాధికారులు(DAO) ఎక్కడికక్కడ స్థానికంగా ఈ పథకం ప్రారంభ కార్యక్రమాలను లాంఛనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో 5 లక్షల మందికి..
రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి కలిగిన 27 లక్షల మంది రైతుల్లో అర్హులైన 17.90 లక్షల మంది వివరాలను పీఎం-కిసాన్ పోర్టల్ లో ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ అధికారులు నమోదు చేశారు. ఇలా నమోదైన వారిలో 5 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల చొప్పున కేంద్రం జమ చేసింది. ఒకేసారి అందరి ఖాతాల్లో వేస్తే పోర్టల్ స్తంభించడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో సోమవారం నుంచి ప్రతీరోజు కొందరు రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని తెలిపింది. ఈ పథకం ప్రారంభోత్సవం రోజు(ఆదివారం) 5లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ కానుంది.