నేను పేదలను పూజిస్త.. వాళ్లే నాకు వీఐపీలు : మోదీ

నేను పేదలను పూజిస్త.. వాళ్లే నాకు వీఐపీలు : మోదీ
  • ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం: ప్రధాని
  • ఎన్నికల్లో గెలుపు కంటే ముందు ప్రజల హృదయాలను గెలవాలి
  • నేను పేదలను పూజిస్త.. వాళ్లే నాకు వీఐపీలు 

న్యూఢిల్లీ: ప్రజల్లో ‘మోదీ గ్యారంటీ’ ప్రతిధ్వనిస్తున్నదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ‘వికసిత్‌‌ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులతో ఇంటరాక్షన్ తర్వాత ప్రధాని మాట్లాడారు. ఎన్నికల్లో గెలవడానికన్నా ముందు ప్రజల హృదయాలను గెలవడం ముఖ్యమన్నారు. ప్రజల జ్ఞానాన్ని తక్కువ చేయడం సరికాదన్నారు. ‘‘దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగంతో కూడిన అనుబంధాన్ని మేం ఏర్పరచాం. తల్లులు, తండ్రులకు సేవ చేసే ప్రభుత్వం మాది. తమ తల్లిదండ్రులకు పిల్లలు సేవ చేసినట్లే.. మీకోసం మోదీ పని చేస్తాడు” అని తెలిపారు. తాను పేదలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. ‘‘పేదలను పూజిస్తాను. నాకు ప్రతి పేద ఓ వీఐపీ. ప్రతి తల్లి, కుమార్తె, సోదరి వీఐపీ.. ప్రతి రైతు వీఐపీ.. ప్రతి యువకుడు వీఐపీ’’ అని చెప్పుకొచ్చారు.

50 ఏండ్ల కిందటే నెరవేరేవి..

‘‘ప్రజల్లో మోదీ గ్యారంటీ ప్రతిధ్వనిస్తున్నదని.. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఓటర్లకు ధన్యవాదాలు. మోదీ గ్యారంటీ అంటే అన్ని హామీలను నెరవేర్చే గ్యారంటీ అని ప్రజలకు నమ్మకం ఉంది. తప్పుడు ప్రకటనలు చేయడం వల్ల తాము ఏమీ సాధించలేమని కొన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవడం లేదు. ఎన్నికల్లో గెలవాలంటే సోషల్ మీడియాలో కాదు.. ప్రజల మధ్యకు వెళ్లాలి” అని ప్రధాని అన్నారు. ‘‘దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన వారు నిజాయతీతో ప్రభుత్వాన్ని నడిపి ఉంటే.. ఇప్పుడు మోదీ ఇచ్చిన గ్యారంటీలు 50 ఏండ్ల కిందట నెరవేరేవి” అని తెలిపారు.

సోనియా గాంధీకి బర్త్‌‌డే విషెస్

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘సోనియా గాంధీజీకి బెస్ట్ విషెస్. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలి’’ అని ట్వీట్ చేశారు.