వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడీ హర్షం

వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడీ హర్షం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సినేషన్‌‌‌పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎన్జీవోల సాయం తీసుకోవడం ద్వారా టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ సప్లయ్‌‌తోపాటు రాబోయే నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని మోడీకి అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీతోపాటు మహారాష్ట్రలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌ల వ్యాప్తితో భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మోడీ అధికారులతో ఈ మీటింగ్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. 

‘దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతన్న తీరు గురించి ప్రధాని మోడీకి అధికారులు సమగ్రంగా వివరించారు. ఏయే వయస్సుల వారీగా ఎంతమందికి టీకా ఇస్తున్నామనే విషయాలను కూడా ఆయనకు చెప్పారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు వివిధ రాష్ట్రాల్లోని సాధారణ ప్రజానీకానికి టీకాలు ఇస్తున్న వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 5.6 శాతం మందికి మాత్రమే రెండు టీకా డోసులు ఇచ్చారు. అయితే గత ఆరు రోజుల్లో 3.77 కోట్ల టీకా డోసులు ఇవ్వడం విశేషం. ఇది మలేషియా, సౌదీ అరేబియా, కెనడా లాంటి దేశాల మొత్తం జనాభాతో సమానం కావడం గమనార్హం.