కార్మికులతో కలిసి ప్రధాని మోడీ భోజనం

కార్మికులతో కలిసి ప్రధాని మోడీ భోజనం

వారణాసిలో చేపట్టిన కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనులు చేసిన నిర్మాణ కార్మికులకు పత్యేక గౌరవం దక్కింది. వారిని సేవలకు గౌరవంగా ప్రధాని నరేంద్ర మోడీ పూల వర్షం కురిపించారు. గంగా నది ఘాట్లను, కాశీ విశ్వనాధుడి ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన కారిడార్‌‌ ఫేజ్‌ 1ను ఆవిష్కరించే ముందు ఆయన.. కార్మికులను ఇలా గౌరవించారు. అనంతరం వారితో కలిసి ఆయన ఒక గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. అలాగే కార్మికులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. 

కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ఆవిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చమట చిందించిన సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కరోనా ప్యాండెమిక్ సమయంలోనూ కార్మికులు పనులు ఆపలేదన్నారు. ఇప్పుడు వాళ్లను కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ కారిడార్ కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాత సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోడీ అన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణంలో ఇది సరికొత్త అధ్యయమని, కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోందని అన్నారు. కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదన్నారు. ఈ కారిడార్ సాయంతో దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చని తెలిపారు మోడీ.

కాశీ విశ్వనాథుడి ఆలయం చుట్టూ గతంలో 3 వేల చ.అడుగుల స్థలంలోనే దర్శనాలకు ఏర్పాట్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని 5 లక్షల చదరపు అడుగులకు పెంచి మరిన్ని వసతులు కల్పించారు. ఆలయం చుట్టూ భూసేకరణ పెద్ద సవాల్ గా నిలిచినా అధికార యంత్రాంగం అన్నీ పూర్తి చేసింది. ఒక్క కోర్టు కేసు లేకుండా చుట్టుపక్కల స్థలాలను సేకరించారు. వారికి మరో చోట మంచి పునరావాసం కల్పించారు. కారిడార్ కోసం కాశ్వీ విశ్వనాథుని ఆలయం చుట్టూ 1400 షాపులు, 300 ఇండ్లను తొలగించి.. టూరిస్ట్ గెస్ట్ హౌజ్ లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, మ్యూజియం, విజిటల్స్ గ్యాలరీ, వేదిక్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కారిడార్‌‌లో మొత్తంగా 23 ప్రధాన భవనాలు ఉన్నాయి. 2019 మార్చిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆలయం నుంచి గంగా ఘాట్లకు సులువుగా వెళ్లేలా మార్పులు చేర్పులు చేశారు. ర్యాంపులు, ఎస్కలేటర్లతో అత్యాధునిక వసతులు కల్పించారు. వృద్ధులు కూడా ప్రయాస లేకుండా సులువుగా ఆలయ ప్రాంగణంలో తిరిగేలా, ఘాట్లకు వెళ్లేలా ఏర్పాట్లు జరిగాయి. ఈ కారిడార్ మొత్తానికి 800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 339 కోట్లు ఖర్చయ్యాయి.