పీఎన్​బీ లాభం 52శాతం జంప్.. నాలుగో క్వార్టర్​లో రూ.4,567 కోట్లు

పీఎన్​బీ లాభం 52శాతం జంప్..  నాలుగో క్వార్టర్​లో రూ.4,567 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.36,705 కోట్లు.. షేరుకు రూ.2.90 చొప్పున డివిడెండ్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)  నికర లాభం మార్చి క్వార్టర్లో 52 శాతం పెరిగి రూ.4,567 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు రూ.3,010 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ క్వార్టర్లో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.36,705 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.32,361 కోట్లు వచ్చాయని పీఎన్​బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.28,113 కోట్ల నుంచి ఈసారి రూ.31,989 కోట్లకు పెరిగింది.  నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) కూడా గత ఏడాది ఇదే కాలంలో రూ.10,363 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ.10,757 కోట్లకు మెరుగుపడింది. 

బోర్డు సమావేశం తర్వాత పీఎన్​బీ ఎండీ,  సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, లాభాల పెరుగుదలకు మొత్తం వ్యాపార వృద్ధి, రైటాఫ్​ల రికవరీ, ట్రెజరీ ఆదాయం కారణమని అన్నారు. బ్యాంక్ మొత్తం  డిపాజిట్లు,  అడ్వాన్సులు  రూ.26.83 లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాది లెక్కన ఇవి 14 శాతం ఎగిశాయి. సాంకేతికంగా రద్దు చేసిన ఖాతాలలో రికవరీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.4,926 కోట్లుగా ఉండగా, ట్రెజరీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన రూ.1,157 కోట్ల నుంచి రూ.4,314 కోట్లకు పెరిగింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ వృద్ధి 11-–12 శాతం ఉంటుందని, డిపాజిట్లు 9–-10 శాతం పెరుగుతుందని బ్యాంక్ అంచనా వేస్తున్నట్లు చంద్ర చెప్పారు.  కార్పొరేట్ లోన్లు 9-–10 శాతం పెరుగుతాయని తెలిపారు. బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి 17 శాతం ఉందని, అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మూలధనం అవసరం లేదని చంద్ర అన్నారు.  

బాండ్ల ద్వారా రూ.8 వేల కోట్ల సమీకరణ

2025–-26లో  బాసెల్–3 కంప్లయంట్​ బాండ్ల జారీ ద్వారా రూ. ఎనిమిది వేల కోట్ల వరకు సేకరించే ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది.  బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 200 బ్రాంచ్​ల​ను ఏర్పాటు చేయనుంది. మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది.  బ్యాంకు  స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏలు) మార్చి 2024 చివరి నాటికి 5.73 శాతం నుంచి 3.95 శాతానికి తగ్గాయి. నికర ఎన్​పీఏలు 0.73 శాతం నుంచి 0.40 శాతానికి తగ్గాయి. 

2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి 15.97 శాతం నుంచి 17.01 శాతానికి పెరిగింది. 2024–-25 మొత్తం ఆర్థిక సంవత్సరానికి, బ్యాంకు లాభం గత సంవత్సరం రూ.8,245 కోట్ల నుంచి రూ.16,630 కోట్లకు రెట్టింపు అయింది. మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రూ.1,20,285 కోట్ల నుంచి రూ.1,38,070 కోట్లకు పెరిగింది. 2024–-25 సంవత్సరానికి వాటాదారుల ఆమోదానికి లోబడి, రూ.రెండు ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.2.90 చొప్పున డివిడెండ్‌‌‌‌ను బ్యాంక్ బోర్డు సిఫార్సు చేసింది.