బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి బీట్19హెక్టారులోని మొక్కల నరికివేత ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం బుడ్డగూడెం గ్రామానికి చెందిన పోడు రైతులు మొక్కలు నరుకుతున్నారనే సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోడుదారులు,అధికారులు మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళకు గాయాలు కావడంతోపాటు సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను 108లో భద్రాచలం తరలించారు. ఓ ఫారెస్ట్గార్డుకి స్వల్ప గాయాలయ్యాయి.
తహసీల్దార్ భగవాన్ రెడ్డి, అదనపు ఎస్సై రమణారెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పాల్వంచ ఎస్ఆర్వో అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పోడుదారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తమను అడ్డుకుంటే పురుగుల మందు తాగుతామని పోడు రైతులు తేల్చి చెప్పడంతో వెనుదిరిగారు. 20 రోజు కిందట మొక్కలు నరికిన ఘటనపై బుడ్డగూడెం గ్రామానికి చెందిన 26 మంది పోడుదారులపై అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పాల్వంచ ఎఫ్ఆర్వో అనీల్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ పోడు వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
