అరెస్టు భయంతోనే కవిత దొంగ ధర్నాలు

అరెస్టు భయంతోనే కవిత దొంగ ధర్నాలు
  •      మాజీ మంత్రి పుష్పలీల

హైదరాబాద్, వెలుగు: లిక్కర్  కేసులో అరెస్టు చేస్తారనే భయంతోనే ఎమ్మెల్సీ కవిత ధర్నాలు, దీక్షలంటూ పబ్లిక్ లో ఉంటున్నారని కాంగ్రెస్  నేత, మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. శనివారం గాంధీ భవన్ లో ఆమె మాట్లాడారు. గత పదేండ్లలో మహిళల సమస్యలను ఎప్పుడూ కవిత పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు బయటకు వచ్చి మహిళా రిజర్వేషన్లు , జీవో 3 అంటూ డ్రామాలు ఆడుతున్నారని, మహాశివరాత్రి రోజు కొంగ జపంలాగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. 

కాంగ్రెస్ ను , సీఎం రేవంత్  రెడ్డిని ప్రశ్నించే అర్హత ఆమెకు లేదన్నారు. సోనియా గాంధీ భిక్షతోనే మాజీ సీఎం కేసీఆర్  కుటుంబానికి రాజకీయ ఉపాధి లభించిందని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పారని, లోక్ సభ ఎన్నికల్లో కూడా మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు.