‘బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం కూడా’.. బహుజన బతుకమ్మ సమాలోచనకు రండి !

‘బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం కూడా’.. బహుజన బతుకమ్మ సమాలోచనకు రండి !

(ఆగస్టు 17, 2025న ‘ప్రకృతి రక్షణే-ప్రజల రక్షణ’ అనే అంశంపై  బాగ్ లింగంపల్లి అరుణోదయ కార్యాలయం ముందుగల ఒక హాలులో,  బహుజన బతుకమ్మ సమాలోచన)

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పతాకగా 2010 బాటలో బతుకమ్మగా ప్రారంభమై ‘బహుజన బతుకమ్మ’ నవ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా 2025 నాటికి 15వ ఏడుకు చేరింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఈ ఏడు ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ- ప్రకృతి విధ్వంసమే ప్రజలపై యుద్ధం’ అనే విషయంపై బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ‘బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం కూడా’ అనే విధానంతో 2019లో యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వ్యతిరేకించినట్లే, అట్లాంటి ప్రకృతి విధ్వంసం పలు రూపాల్లో నేడు తీవ్రమవుతున్న దశలోనే మేమీ అంశాన్ని ప్రజల్లోనికి తీసుకుపోవాలని భావించాము.

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను, 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించిన ప్రతినిధులను, ఈ ఏడు తమ ప్రాంతంలో నిర్వహించాలనుకుంటున్న ప్రతినిధులను,   ప్రజాస్వామిక వాదులను,  శ్రేయోభిలాషులందరినీ దీనికి ఆహ్వానిస్తున్నాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో TPSK  లో వరద జలాలు నిండడంతో,  బాగ్ లింగంపల్లి అరుణోదయ కార్యాలయం ముందుగల ఒక హాలులోనే దీనిని నిర్వహిస్తున్నాం.

ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమాలోచనల సమావేశానికి సకాలంలో వచ్చి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రకృతి విధ్వంసం, కర్బన ఉద్ఘారాల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలన్నీ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల ఈ అంశంపై (BRICS) దేశాల చర్చలు, దిద్దుబాటు చర్యల కార్యక్రమం అర్ధాంతరంగా ముగిసినట్టు మనం పత్రికల్లో చదివాం.

ప్రకృతి సిద్ధ సహజ వనరులన్నీ సరుకులా? వినియోగ వస్తువులా? అనే అంశాలను మన దేశంతో పాటు ప్రపంచమంతటా చర్చనీయాంశం అవుతున్నది. అడవుల్లో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని లెక్క కట్టడానికి కొలమానం ఏమిటనేది, అక్కడ అడవి బిడ్డలైన ఆదివాసుల కోణం నుంచి చూడాలా? కార్పొరేట్ల కోణంలో చూడాలా? గ్రానైట్ కంపెనీలన్నీ కొండలను పిండి చేస్తుంటే చెల్లాచెదురైన కోతులన్ని గ్రామాల్లోని, పట్టణాల్లోని ఇళ్ళల్లో చొరబడి చేస్తున్న ధ్వంసం, పెరళ్లలో, చేను చేలుకల్లో కూరగాయలు, అపరాలు పండించని స్థితికి ప్రజల కోణం నుండి చూడాలా? ప్రభుత్వ ఆదాయ కోణం నుంచి  చూడాలా? అందుకే ప్రకృతి విధ్వంసం అడవుల ధ్వంసం మన వ్యవసాయాన్ని,  పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తున్న అంశాలుగా ఉన్నాయి.

వీటికి తోడు తెలంగాణ గ్రామీణ ప్రాంతమే మద్యానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందనేది ఆందోళన కల్పిస్తున్న అంశం. దీనికి తోడు గంజాయి లాంటి ప్రమాదకర మత్తులు బడుల దాకా వస్తున్నాయి. యువతను నిర్వీర్యపరుస్తున్నాయి. నేరాలు- ఘోరాలకు కారణమవుతున్నాయి. పదేళ్ల తెలంగాణలో 16 వేల ఫోక్సో కేసులు నమోదయినాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చును. ఇవన్నీ ఎదిరించే పోరాటాలతో పాటు ఒక సాంస్కృతికోద్యమ ఆవశ్యకతను బహుజన బతుకమ్మ గుర్తిస్తుంది. అందుకే సుదీర్ఘంగా పయనిస్తుంది.

కాబట్టి నిత్య కరువులు-నిత్య వరదల నుంచి కాపాడుకోవడానికి సేవ్​ రాక్, సేవ్​ సాండ్​, సేవ్​ ఫారెస్ట్​, సేవ్​ సాయిల్​ అంటూ పోరాడుతూ సేవ్​ నేచర్​,  సేవ్​ ఫ్యూచర్​ అనే ఉద్యమానికి ఆహ్వానం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం! ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని భావిస్తూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన బతుకమ్మ భాగస్వామ్య సంస్థలకు, శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

విమలక్క, ప్రొఫెసర్ ​కె. లక్ష్మి, బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ, తెలంగాణ రాష్ట్రం