ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు

ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు

   

శామీర్ పేట వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా శామీర్​పేటలో 1,200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రాజీవ్ రహదారిపై సైబరాబాద్ ఎస్​వోటీ, శామీర్​పేట పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. కర్నాటక నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి ట్రాలీ ఆటోలో ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో పోలీసులు, అధికారులు కలిసి ట్రాలీ ఆటోను గుర్తించి సోదాలు చేశారు. 

ఉల్లిగడ్డల కింద ఉన్న 1.20 టన్నుల నిషేధిత విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.19.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్లు శ్రీకాంత్, నవీన్​ను అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలో నకిలీ విత్తనాలు కొని ఇక్కడ  అమ్మేందుకు ప్లాన్ చేసిన మందమర్రి, మంచిర్యాలకు చెందిన శివయ్య, సిద్ధయ్య, సురేశ్ కర్నాటకలోని కుస్తగిలో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఫోన్లతో పాటు వెహికల్​ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.