హుజూరాబాద్​లో డ్రోన్లతో నిఘా

హుజూరాబాద్​లో డ్రోన్లతో నిఘా
  •     సీసీ కెమెరాల ద్వారా ప్రత్యర్థుల కదలికలను పసిగట్టే ఎత్తుగడ
  •     బీజేపీ మీటింగులకు చోటు దొరక్కుండా టీఆర్​ఎస్​ చర్యలు
  •     ఫంక్షన్​ హాళ్లన్నీ తమ ఖాతాలో వేసుకుంటున్న అధికార పార్టీ
  •     సోషల్ మీడియాలో ఫేక్​ న్యూస్​తో మైండ్​గేమ్​

కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్​ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ టీఆర్​ఎస్  పెద్దలు అక్కడ ఇప్పుడే తమ మార్క్​ రాజకీయాలకు తెరలేపారు. నియోజకవర్గంలోని అన్ని పట్టణాలు, ఊర్లపై పోలీసులతో నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం వీణవంక మండలంలో కమాండ్ కంట్రోల్ వెహికల్​ను, డ్రోన్లను రంగంలోకి దింపారు. వాడవాడలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్​ కంట్రోల్​ వెహికల్​తో ఇంటర్​కనెక్ట్​ చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే వీటిని ఏర్పాటుచేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నా.. వీటి వెనుక ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించే పన్నాగం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ లీడర్లు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టే చాన్స్  లేకుండా ఫంక్షన్​హాళ్లను, ఇన్​చార్జులు ఉండే వీలులేకుండా లాడ్జీలు, రెంటెడ్​ ఇండ్లను రూలింగ్​ పార్టీ లీడర్లే నయానో, భయానో బుక్​ చేసుకుంటున్నారు. ఇక కొందరు లీడర్లయితే ఫేక్​న్యూస్​ను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తూ మైండ్​గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ  ఏరియాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తుగా కొన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీసులు మోహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని స్టేషన్లలో ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు వీణవంక మండలంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ వెహికల్‌‌‌‌ను దించారు. డ్రోన్​ కెమెరాలు కూడా తెప్పించి ఓ ట్రయల్​ వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాలను వీటికి అనుసంధానం చేయనున్నారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కరీంనగర్ కార్పొరేషన్​ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్​ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. వాడవాడలా సీసీ కెమెరాలు పెట్టి రూలింగ్​ పార్టీ కార్పొరేటర్ల ఇండ్లలో కంట్రోల్​ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటితో తమ ప్రత్యర్థులు ఏ ఇండ్లలో ఎవరిని కలుస్తున్నారో సమాచారం సేకరించి అందుకు తగ్గట్టు పైఎత్తులు వేశారు. ప్రధానంగా బీజేపీ లీడర్ల కదలికల మీద దృష్టిసారించడంపై అప్పట్లో ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. 

ఫంక్షన్​ హాళ్లను దొరకనియ్యట్లే..

టీఆర్​ఎస్​ లీడర్లు తమ అధికారబలాన్ని ఉపయోగించి నియోజకవర్గంలో  బీజేపీ, కాంగ్రెస్​వాళ్లకు కనీసం  మీటింగ్ లు పెట్టుకోవడానికి చోటు దొరక్కుండా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే లీడర్లు, ఇన్​చార్జులు ఉండడానికి , ప్రతి మండలంలో పార్టీ కార్యాలయాలకు ముందస్తుగా ఇండ్లు, ఫంక్షన్ హాళ్లను అటు టీఆర్ఎస్ లీడర్లతో పాటు బీజేపీ లీడర్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. కానీ బీజేపీ మాట్లాడుకున్న మరుక్షణమే టీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని బీజేపీకి ఇవ్వకుండా ఓనర్లను బెదిరించి, వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హుజూరాబాద్‌‌లో కొత్తగా ఓ ఫంక్షన్ హాల్  కట్టారు. దీంతో బీజేపీ లీడర్లు ముందస్తుగా ఓనర్​తో ఒప్పందం చేసుకున్నారు. కానీ సాయంత్రం కల్లా అక్కడికి స్థానిక టీఆర్ఎస్  ఇన్​చార్జ్​ చేరుకొని ఆరునెలల పాటు తమకే కేటాయించేలా ఓనర్​కు అడ్వాన్స్​ ఇచ్చి వెళ్లారు. జమ్మికుంటలో నాలుగు ఫంక్షన్ హాళ్లను బీజేపీ లీడర్లు మాట్లాడుకోగా, అందులో మూడు ఫంక్షన్​ హాళ్ల నిర్వాహకులను టీఆర్​ఎస్​ లీడర్లు తమ వైపు తిప్పుకున్నారు. ఇక కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌‌ను బీజేపీ బుక్‌‌ చేస్తే.. అదే ఫంక్షన్‌‌ హాల్‌‌లో  స్థానిక టీఆర్ఎస్ ఇన్​చార్జ్​ చల్లా ధర్మారెడ్డి వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. హుజూరాబాద్​, జమ్మికుంట, కమలాపూర్​లోనూ ఇదే తంతు నడుస్తోంది.

ఫేక్​ న్యూస్​ను వైరల్​చేస్తూ..

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్​ గెలుపును ఎలాగైనా అడ్డుకునేందుకు కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు మైండ్​ గేమ్​ ఆడుతున్నారు.  ఈ నెల 25న ఈటలపై ఓ ఫేక్ లెటర్ సృష్టించి సోషల్​ మీడియాలో వైరల్​ చేసినట్లు ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు. అదే రోజు హుజూరాబాద్‌‌లో అంబేద్కర్​ విగ్రహానికి బీజేపీ  కండువా వేశారని టీఆర్ఎస్  లీడర్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది కూడా ఫేక్​ అని ఆరోపించిన బీజేపీ లీడర్లు  విగ్రహం చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిజం తేల్చాలని సవాల్​ విసిరారు. కానీ పోలీసులు ఇప్పటివరకు  ఆ సీసీ ఫుటేజీలను బయట పెట్టలేదు.