
- రూ.6.31 లక్షలు, 23 ఏటీఎం కార్డులు, కారు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఏటీఎంలకు వచ్చేవారిని టార్గెట్చేస్తూ.. డబ్బులు చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్చేశారు. మంగళవారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తుర్కయంజాల్లోని ఓ ఏటీఎం వద్ద ఒకరి దృష్టి మరల్చి రూ.40 వేలు కాజేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తుర్కయంజాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో పాత నేరస్తుడు సూర్యాపేట టౌన్ కు చెందిన సుదబోయిన వెంకటేశ్గా గుర్తించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉంటూ క్యాబ్డ్రైవర్గా పని చేస్తున్నట్లు తేల్చారు. 2021 నుంచి ఇప్పటివరకు సూర్యాపేట, ఖమ్మం, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్, ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ తదితర 27 చోట్ల వివిధ ఏటీఎంల వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన నిరక్షరాస్యులు, వృద్ధులను టార్గెట్ చేసి, రూ.12,61,246 కాజేశాడు.
గతంలో పలుమార్లు అరెస్టయినా తీరు మారకపోవడంతో పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు. తాజాగా నిందితుడి వద్ద నుంచి రూ.6,31,000, ఫోన్, వివిధ బ్యాంక్ లకు చెందిన 23 ఏటీఎం కార్డులు, ఒక కారు స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. అనంతరం ఆదిభట్ల పోలీసులకు రివార్డులు అందజేశారు. ఏసీపీ కేపీవీ.రాజు, సీఐ రవికుమార్, ఎస్సై నోయల్ రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.