
ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో గురువారం మొదలైన పీహెచ్డీ అడ్మిషన్ల ఇంటర్వ్యూలను కొందరు స్టూడెంట్లు అడ్డుకున్నారు. తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతుండగా అక్కడికి చేరుకుని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లను అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. పీహెచ్డీ అడ్మిషన్ల ప్రాసెస్ సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంట్రన్స్ ఫలితాల ప్రకటనలోనే అవకతవకలు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ ఫలితాలు ప్రకటించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
దీనిపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. కోర్టులో వివాదం నడుస్తుండగానే ఇంటర్వ్యూలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. తక్షణమే ప్రాసెస్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఫలితాలు ప్రకటించామని ఓయూ అధికారులు తెలిపారు. కొంత మంది స్టూడెంట్లు అడ్మిషన్లు పొందేందుకు క్వాలిఫయింగ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని, అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.