నాగోల్ గోల్డ్ షాపులో కాల్పుల కేసు: నిందితుడిని పట్టించిన రెడ్ షర్ట్

నాగోల్ గోల్డ్ షాపులో కాల్పుల కేసు: నిందితుడిని పట్టించిన రెడ్ షర్ట్

హైదరాబాద్ నాగోల్ గోల్డ్ షాపులో కాల్పుల కేసును రాచకొండ పోలీసులు  చేధించారు. ఈ కేసులో  మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించగా... ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరార్ లో ఉన్నారు.  నిందితుల నుంచి బంగారం, మూడు కంట్రీ మేడ్ పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో గజ్వేల్ కు చెందిన మహేందర్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే ఈ కేసులో  రెడ్ షర్ట్, హోండా యాక్టివా బైక్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించడం గమనార్హం. నిందితులు చోరీకి పక్కా రెక్కీ చేసి ఫ్రీ ప్లాన్డ్ గా దొంగతనానికి పాల్పడ్డారు. రెక్కీ నిర్వహించేటపుడు నిందితుల్లో ఒకరు రెడ్ షర్ట్ వేసుకున్నాడు. అదే నిందితుడు దొంగతనం చేసేటప్పుడు సేమ్ బైక్ పై అదే రెడ్ షర్ట్ వేసుకున్నాడు. దీంతో పోలీసులకు పట్టుబడ్డాడు.

మహదేవ్‌ జువెల్లర్స్‌తో పాటు సికింద్రాబాద్ మోండామార్కెట్‌ వరకు సుమారు 800 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఇందులో రెడ్ షర్ట్‌  వేసుకున్న వ్యక్తి హోండా యాక్టివాపై వెళ్లడం గుర్తించారు.అదే బైక్‌ కొద్ది దూరం వెళ్ళిన తరువాత నంబర్ ప్లేట్‌ లేకపోవడం గమనించారు. హోండా యాక్టివాల బైక్‌ నంబర్‌‌ ఆధారంగా సెర్చ్‌ చేశారు.  బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్స్‌తో గాలించారు. హోండా యాక్టీవా నంబర్‌‌ ఆధారంగా గజ్వేల్‌లోని మహేందర్‌ను ట్రాక్ చేశారు. అతని  భార్య గుడియా,బావమరిది సుమీర్‌‌చౌదరిలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరు ఇచ్చిన సమాచారంతో‌ దొంగిలించిన బంగారం,పిస్టల్స్,క్యాషన్‌ను పాలకుర్తిలోని రితిష్‌ వైష్ణవ్‌,కొండపాకలోని మనీష్‌ వైష్ణవ్‌ ఇళ్లలో దాచినట్లు పోలీసులు గుర్తించారు.