రాజ్ భ‌వ‌న్ కు వెళ్తున్న కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్

రాజ్ భ‌వ‌న్ కు వెళ్తున్న కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌న్న నేత‌లు

హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై నిర‌స‌న‌గా గాంధీభ‌వ‌న్ నుండి రాజ్ భ‌వ‌న్ వ‌ర‌కు కాంగ్రెస్ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాజ్ భ‌వ‌న్ కు వెళ్తున్న‌ కాంగ్రెస్ నేతలను దిల్ కుషా గెస్ట్ హౌస్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మానిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బోసురాజు, దామోదర రాజనర్సిహ్మ, శ్రీనివాస్ కృష్ణన్, దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయ్యారు. దిల్ కుషా గేట్ బయట ఎమ్మెల్యే సీతక్క, ఇందిరా శోభన్, నెరేళ్ల శారదా మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టం అమ‌లు వ‌ద్దంటూ దేశ‌వ్యాప్తంగా రాజ్‌భ‌వ‌న్‌ల వ‌ద్ద ఆందోళ‌న‌ల‌తో స‌హా గ‌వ‌ర్న‌ర్‌ల‌కు విన‌తి పత్రం అంద‌జేయాల‌ని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో రాజ్‌భ‌వ‌న్‌కు బ‌య‌లుదేరిన కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు దిల్ కుషా గెస్ట్ హౌజ్ వ‌ద్ద‌ అరెస్ట్ చేసి గోషామ‌హ‌ల్ పోలీస్ట్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. దేశానికి వెన్నుముక‌గా ఉన్న రైతుకు ఇబ్బంది క‌లిగించేలా కేంద్రం తెచ్చిన మూడు చ‌ట్టాల‌పై కాంగ్రెస్ పోరాడుతుంద‌ని నేత‌ల‌న్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రైతు వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని నేత‌లు మండిప‌డ్డారు. బిల్లులో మ‌ద్ధ‌తు ధ‌ర క‌న్నా ఎక్కువ‌గా రైతుల‌కు ధ‌ర క‌ల్పించాల‌న్న అంశమే లేద‌ని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు.