మావోల బంద్ పై అటవీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్​

మావోల బంద్ పై అటవీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్​

కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న అటవీ గ్రామాల్లో మళ్లీ నక్సల్స్​అలజడి నెలకొంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా దాన్ని తిప్పికొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్​నిర్వహిస్తున్నారు. ఇటీవల చత్తీస్ గఢ్​రాష్ట్రంలోని బీజాపూర్​ అడవుల్లో జరిగిన భారీ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రహార్​సైనిక దాడులకు నిరసనగా సోమవారం మావోయిస్టులు భారత్​బంద్​నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కూడా బంద్​ను సక్సెస్​చేయాలని ఇటీవల మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్​ప్రకటన విడుదల చేయడంతో  పోలీసులు హై అలర్ట్​ ప్రకటించారు. తెలంగాణ, చత్తీస్​గఢ్​ రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో మావోయిస్టులు ఏదైనా ఘటనలకు పాల్పడుతారనే అనుమానంతో  పికెటింగ్​ఏర్పాటు చేసి తనిఖీలను చేపడుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే ఎవరూ ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నక్సల్స్​కు టార్గెట్​గా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలు, రాజకీయ నాయకులు గ్రామాల్లో ఉండవద్దని, సేఫ్​జోన్​కు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. 

సమాచారమిస్తే బహుమతి

నక్సలైట్లు జిల్లాలోకి ప్రవేశించారన్న సమాచారంతో వారి ఫోటోలతో కూడిన పోస్టర్​ను బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తున్నారు. నక్సల్స్​ప్రభావిత ప్రాంతాలైన మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల, కాళేశ్వరం, మల్హర్, కాటారం మండలాల్లోని అడవుల్లో మావోయిస్టులు కురుసం మంగు, దీపక్, మడకం సింగి, మంగ్లులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వారి ఫోటోలు, పేర్లతో  పోస్టర్లు ప్రచురించారు. ‘సమాచారం మాకు- బహుమతి మీకు’ అంటూ ఆ వాల్ పోస్టర్లను పల్లెల్లో అంటిస్తున్నారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించినవారు, సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

స్పెషల్​పార్టీ పోలీసులతో కూంబింగ్​

మావోయిస్టుల బంద్​ నేపథ్యంలో పోలీసులు అడవుల్లో భారీ కూంబింగ్​ చేపట్టారు. నక్సల్స్​ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెట్టూపుట్ట గాలిస్తున్నారు. కాటారం డీఎస్సీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు సబ్​ డివిజన్​ సీఐల ఆధ్వర్యంలో ఎస్సైలు, స్పెషల్​పార్టీ పోలీస్ బలగాలతో కూంబింగ్​ముమ్మరం చేశారు. సమస్యాత్మక గ్రామాలపై డేగ కన్ను వేశారు. నక్సల్స్​ నుంచి ఎలాంటి సమస్య ఎదురైనా తిప్పికొట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.