కిడ్నాప్​ గ్యాంగుల..సంచారం లేదు : ​కమిషనర్​ కల్మేశ్వర్

కిడ్నాప్​ గ్యాంగుల..సంచారం లేదు : ​కమిషనర్​ కల్మేశ్వర్
  •    అనుమానితులపై దాడులు చేస్తే యాక్షన్​ తప్పదు
  •     వదంతులను తిప్పికొట్టడానికి అవగాహనా కార్యక్రమాలు
  •     పోలీస్​ కమిషనర్ ​కల్మేశ్వర్ ​సింగన్​వార్​

నిజామాబాద్, వెలుగు :  జిల్లాలో పిల్లలను కిడ్నాప్​చేసే గ్యాంగులు తిరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని పోలీస్ ​కమిషనర్​ కల్మేశ్వర్​కోరారు. కిడ్నాప్​ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాలేజీలు, స్కూల్స్​లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని, విలేజీల్లోనూ ఈ ప్రోగ్రామ్స్​చేపడతామన్నారు. సోమవారం ఆయన తన ఛాంబర్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మూడు చోట్ల పిల్లల మిస్సింగ్​కేసులు నమోదు కాగా ఛేదించామన్నారు. ఈ ఘటనల వెనుక గ్యాంగులు ఉన్నాయనే  ప్రచారంతో ప్రజలు అనుమానితులపై దాడులు చేస్తున్నారన్నారు. అనుమానాలుంటే పోలీసులకు తెలపాలే గానీ భౌతిక దాడులు చేయొద్దన్నారు. 

వీడీసీలపై వ్యతిరేకత లేదు

విలేజ్​ డెవలప్​మెంట్​కమిటీలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని సీపీ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారి సమాచారాన్ని సంబంధిత గవర్నమెంట్​ఆఫీసర్లకు తెలపాలే గానీ, జరిమానాలు విధించడం, కుల బహిష్కరణలు చేయడం కరెక్ట్​ కాదన్నారు. అలాంటి వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. జిల్లాలో ట్రాఫిక్ ​కంట్రోల్​కు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం 

జిల్లాలో గంజాయి తదితర మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విక్రయాలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బార్, వైన్స్​నిర్ణీత టైమ్​కు క్లోజ్​చేయాలని లేకుంటే, లైసెస్సుల రద్దుకు రెకమెండ్​ చేస్తామన్నారు. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే హోటళ్లు, పాన్​షాప్​ల సమాచారాన్ని పౌరులు వాట్సాప్​ద్వారా తమకు తెలియజేయొచ్చన్నారు. 

విదేశీ మోసాలపై పీడీ చట్టం 

విదేశాల్లో జాబ్స్​ ఇప్పిస్తామని, పాస్​పోర్టులు, వీసా గడువు పెంచేలా చేస్తామని మోసగిస్తున్న ఏజెంట్లు జిల్లాలో 50 మంది వరకు ఉన్నారని సీపీ కల్మేశ్వర్​ పేర్కొన్నారు. గవర్నమెంట్​ పర్మిషన్​(లైసెన్స్) లేకుండా కేవలం మోసం చేయడానికి ఏజెంట్ల అవతారమెత్తిన వారికి నోటీసులు జారీ చేశామన్నారు. వారి తీరులో మార్పు రాకుంటే పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. కేసులు నమోదైన ఏజెంట్ల ఫైళ్లను మరోసారి క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. అడిషనల్​ డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్​ఆఫీసర్​ చైతన్యరెడ్డి, తదితరులు ఉన్నారు.