ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ మోసం వెలుగుచూసింది. ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ షార్ట్ ఫిలిం నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట ఓ వ్యక్తి నుంచి నుంచి ఏకంగా 15 లక్షల రూపాయలు గుంజినట్లు వీరిపై ఆరోపణలు వస్తున్నాయి.
డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యూవల్ చేస్తామంటూ నమ్మించి ఈ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా బయటపడింది.
బాధితుడు శివక్రాంతి కుమార్ యూకేలో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండటంతో.. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాలో ఉన్న తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే.. వీసా ప్రాసెస్ పూర్తి చేస్తామని నిందితులు బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నిజమేనని నమ్మి.. బాధితుడు ఏకంగా 15 లక్షల రూపాయల వరకు చెల్లించాడు.
కట్ చేస్తే నెలలు గడుస్తున్నా వీసా రాలేదు.. పోనీ ఇచ్చిన డబ్బుల గురించి అడిగితే నిందితుల నుంచి సరైన సమాధానం కూడా లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు కుమార్.. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. క్రైమ్ నంబర్ 515/2025 కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన.. గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి.రాజు వెల్లడించారు.
