
సిద్దిపేట జిల్లా : సిద్దిపేట సిఎంఆర్ షాపింగ్ మాల్ లో పది రూపాయలకే చీర అఫర్ ప్రకటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.
సిద్దిపేటలో ని సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఈ ఉదయం తొక్కిసలాట జరిగింది. 20మంది మహిళలకు గాయాలయ్యాయి. పది రూపాయలకే చీరంటూ షాపింగ్ మాల్ ఆఫర్ పెట్టడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకే ఆఫర్ అని ప్రకటించడంతో షాపింగ్ మాల్ ముందు క్యూకట్టారు. ఒక్కసారిగా షాపు ఓపెన్ చేసి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడంతో… మహిళల మధ్య తోపులాట జరిగింది. తొక్కిసలాటలో 20 మంది గాయపడ్డారు.
మరోవైపు మహిళలు చీరల కోసం ఎగబడటంతో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసు, మరో వ్యక్తి నుంచి ఆరు వేల రూపాయలు కొట్టేశారు దొంగలు. పోలీసులు షాపింగ్ మాల్ కు చేరుకొని … గాయపడ్డ మహిళలను హాస్పిటల్ కు తరలించారు.