
వరంగల్ సిటీ, వెలుగు: మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్మ్యాట్రిమోనీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ ఏసీపీ గిరికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ సిటీ తిలక్ రోడ్ఎల్బీ నగర్లో ‘శుభ్ మ్యాట్రిమోనీ’ పేరుతో ఆఫీస్ఓపెన్ చేశారు. వచ్చిన కస్టమర్లకు తమ వద్ద మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి రూ.3 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆఫీస్లో పని చేసే అమ్మాయిలు మంద దివ్య, బర్ల ప్రియాంక, మూల కళ్యాణి, లకిడి లక్ష్మి ప్రసన్న, లక్కర్సు రమ్యను వధువు, వధువు కుటుంబ సభ్యులుగా కస్టమర్లతో మాట్లాడించేవారు. వారిని నమ్మించిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, డబ్బులు సాయం చేయమని చెప్పి అడిగేవారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బు తీసుకుని తర్వాత ఫోన్ నంబర్లను బ్లాక్చేసేవారు. ఇలా సుమారు 300 మంది కస్టమర్లను మోసం చేశారు. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఇంతేజార్ గంజ్ పోలీసులు ఆఫీసుపై రైడ్ చేశారు. మహారాష్ట్ర గచ్చిరోలికి చెందిన వివేల్ ఖపరే, అనిల్ మనోహర్ ఖోవే, జితేంద్ర యశ్వంత్కొమేటిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, రూ.50 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.