దొంగను పట్టించిన సీసీ కెమెరాలు

దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
  • గ్యాస్ కట్టర్ తో మెషిన్​ ధ్వంసం చేసి...


మెట్పల్లి (జగిత్యాల జిల్లా) వెలుగు: యూట్యూబ్ లో వీడియోలు చూసి ఓ వ్యక్తి ఏటీఎంలో చోరీకి యత్నించాడు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం కట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. మెట్ పల్లి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెరుకు రాకేశ్(35) డ్రైవర్ గా చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు.

కొన్నేండ్ల క్రితం హార్వెస్టర్​కొనుగోలు చేసి నడిపించే క్రమంలో రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పు ఇచ్చినవారు తిరిగి కట్టాలని ఇంటికి వచ్చి ఒత్తిడి చేశారు. దాంతో ఏటీఎంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ లో  ఏటీఎంలో చోరీ ఎలా చేయాలనే వీడియోలు వందల సంఖ్యలో చూశాడు. ఏటీఎం చోరీకి కావాల్సిన గ్యాస్ సిలిండర్, కట్టర్ వెల్లుల్ల రోడ్డులోని ఓ వెల్డింగ్ షాపులో రాత్రి దొంగిలించాడు. అనంతరం  మెట్ పల్లి పట్టణం వెంపేట ఎస్బీఐ, కెనరా బ్యాంకుల దగ్గర రెక్కీ నిర్వహించాడు.

జూన్ 30న భార్య ఏటీఎం కార్డు తీసుకొని అర్ధరాత్రి వేంపేట రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. గ్యాస్ కట్టర్ తో కట్ చేయాలని చూశాడు. ఏటీఎం డోర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 1న వేంపేట మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న కెనరా బ్యాంకు ఏటీఎం ముందు డోర్​ను గ్యాస్ కట్టర్ తో ఓపెన్ చేశాడు. రెండవ డోర్ కట్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఏటీఎం ధ్వంసం చేశాడు. చోరీకి తీసుకెళ్లిన గ్యాస్ సిలిండర్, కట్టర్ తదితర సామాన్లు స్కూటీ పై తీసుకెళ్లి మెట్ పల్లి సరిహద్దులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో పెట్టాడు. ఏటీఎం చోరీకి యత్నించిన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. కెమెరాల్లో రికార్డైన దొంగను గుర్తించి పట్టుకుని రిమాండ్​కు తరలించారు.