
- జనవరిలో చిన్న కుమారుడిని నీటి సంపులో పడేసి చంపి ప్రమాదంగా చిత్రీకరణ
- ఈ నెల 24న పెద్దకొడుకుకు ఉరి వేసి హత్య
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దారుణం
కేసముద్రం, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు చిన్నారులను తల్లే హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య శుక్రవారం వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు మనీశ్, మోక్ష, నిహాల్ ఉన్నారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని, పిల్లలను తన దగ్గరికి తీసుకురాకుండా అత్తమామల వద్దే ఉంచుతున్నాడని మనస్తాపానికి గురైన శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
అంత కంటే ముందు తన ముగ్గురు పిల్లలను చంపేయాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా జనవరి 15న చిన్న కుమారుడు నిహాల్‌ను నీటి సంపులో పడేసి చంపిన తర్వాత ప్రమాదంగా అందరినీ నమ్మించింది. ఆగస్టులో పెద్దకుమారుడు మనీశ్‌ను గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించింది. కుటుంబసభ్యులు గమనించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని టైంలో మనీశ్ గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేసిన శిరీష జ్వరంతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. బాలుడి మృతి విషయం తెలుసుకున్న ఎస్సై మురళీధర్‌రాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే శిరీషపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇద్దరు పిల్లలను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు శిరీషను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.