
మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల16న అర్ధరాత్రి ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురుని హతమార్చిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం, ఆస్తి కోసమే హత్యలకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి మంచిర్యాల డీసీపీ అఖిల్‌మహాజన్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్‌తో కలిసి మంగళవారం డీసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. లక్సెట్టిపేట మండలం ఉత్కూర్కు చెందిన సింగరేణి కార్మికుడైన శనిగరపు శాంతయ్య(57) తన కుటుంబంతో పాటు శ్రీరాంపూర్‌లో నివాసముండేవాడు. ఇతడికి మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన మాసు రాజలక్ష్మి అలియాస్ పద్మ(42)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్త శివయ్యకు తెలిసినా పట్టించుకోలేదు. ఇదే విషయంలో శాంతయ్యకు, అతడి భార్య సృజనకు తరచూ గొడవలు జరిగేవి. తన జీతం , ఆస్తులు వేరే ఎవరికీ ఇవ్వనని, రాజ్యలక్ష్మికే ఇస్తానని చెప్పేవాడు. ఏడాది కింద సృజనకు, శాంతయ్యకు మధ్య సీసీసీ నస్పూర్‌లోని నర్సయ్య భవన్లో, ఆర్కే5బీ మైన్ దగ్గర పంచాయితీలు జరిగాయి. ఈ క్రమంలో శాంతయ్య గుడిపల్లిలోని రాజ్యలక్ష్మి ఇంట్లో ఉంటూ అక్కడినుంచే డ్యూటీ చేస్తున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోక, జీతం ఇవ్వకపోవడంతో పాటు ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తాడని భావించిన సృజన, ఆమె తండ్రి అంజయ్య శాంతయ్యను చంపించాలని ప్లాన్ వేశారు.
ప్రియుడి ద్వారా హత్యా పథకం అమలు...
మరోవైపు శాంతయ్య భార్య సృజనకు లక్సెట్టిపేట బోయవాడకు చెందిన ప్రైవేట్ సర్వేయర్, డాక్యుమెంట్ రైటర్అయిన మేడి లక్ష్మణ్(42)కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో శ్రీరాంపూర్‌లోని సృజన ఇంట్లో తరచూ కలుసుకునేవారు. లక్ష్మణ్ ఆమెకు రూ.4 లక్షలు అప్పు కూడా ఇచ్చాడు. శాంతయ్యను చంపితేనే తన కష్టాలు తీరుతాయని భావించిన సృజన ఆరు నెలల కింద లక్ష్మణ్‌తో కలిసి మర్డర్‌కు ప్లాన్ చేసింది. ఈ పనిచేస్తే లక్సెట్టిపేటలో తన బిడ్డ పేరుమీదున్న మూడు గుంటలను రాసిస్తామని, లేదా అమ్మి పైసలిస్తానని సృజన, ఆమె తండ్రి అంజయ్యకు చెప్పారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతో అతడు చనిపోతే వచ్చే డబ్బుల్లో కొంత తీసుకోవచ్చని, సృజనకు అడ్డు ఎవరూ ఉండరని ఒప్పుకున్నాడు. ఇంతలో శాంతయ్య గద్దెరాగడిలో ఉన్న తన ప్లాట్‌ను సృజనకు తెలియకుండా అమ్మి ఆ పైసలు రాజ్యలక్ష్మికి ఇచ్చాడు. దీంతో లక్ష్మణ్.. లక్సెట్టిపేటలోని అడ్వకేట్ ద్వారా శాంతయ్య అన్నదమ్ముల మీద ల్యాండ్ విషయంలో కేసు, శాంతయ్య పైన మెయింటనెన్స్ కేసు, సింగరేణిలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా సృజనతో మరో కేసు వేయించాడు.
రూ.4లక్షలకు సుపారీ..
శాంతయ్యను చంపడానికి లక్ష్మణ్, సృజన లక్సెట్టిపేటకు చెందిన పందుల వ్యాపారి శ్రీరాముల రమేశ్(36)తో రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ముందు యాక్సిడెంట్చేసి చంపాలనుకున్నారు. దీంతో రమేశ్లక్సెట్టిపేటకు చెందిన కొమాకుల మహేశ్ద్వారా బొలెరో కొన్నారు. శాంతయ్య కదలికలను తెలుసుకునేందుకు లక్ష్మణ్, రమేష్ గుడిపల్లికి వెళ్లి అక్కడ వేల్పుల సమ్మయ్య(34)ను పరిచయం చేసుకొన్నారు. శాంతయ్య సమాచారం ఇస్తే రూ.లక్షన్నర ఇస్తామని చెప్పడంతో అతడు ఒప్పుకున్నాడు. నెల కింద రమేశ్బొలేరోతో శాంతయ్యను ఢీకొట్టి చంపుదామని గుడిపల్లి దగ్గర కాపుకాశాడు. శాంతయ్య, రాజలక్ష్మి మంచిర్యాల నుంచి ఆటోలో గుడిపల్లికి వస్తుండగా ఆటోను ఢీకొట్టడానికి వెళ్తుండగా ఆర్కే5 మైన్‌కు వెళ్లే రోడ్డు మలుపు వద్ద రాత్రి 10 గంటలకు బొలెరో కందకంలో పడిపోయింది. దీంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత నాలుగు రోజులకు శాంతయ్య, రాజ్యలక్ష్మి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఆటోలో వెళ్తుండగా బొలెరోతో ఢీకొట్టాలని చూడగా మిస్సయ్యింది. తర్వాత రామకృష్ణాపూర్అంగడిలో రెండు కత్తులు కొని చంపాలనుకున్నా దొరికిపోతామని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
నిప్పు పెట్టి ప్రమాదంగా చిత్రీకరించేందుకు....
చివరకు శాంతయ్య, రాజ్యలక్ష్మి ఇంట్లో ఉన్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమ్మయ్య ..రమేశ్‌కు ఫోన్ చేసి గుడిపల్లిలోని రాజ్యలక్ష్మి ఇంట్లో ఆమెతో పాటు భర్త శివయ్య, శాంతయ్య ఉన్నారని చెప్పాడు. లక్ష్మణ్, రమేశ్..లక్సెట్టిపేట నుంచి మంచిర్యాలకు వచ్చి ఓ బార్లో మందు తాగారు. నస్పూర్‌కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ద్వారా మూడు పెద్ద క్యాన్లు తెప్పించుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరలోని బంక్‌లో రూ.5వేల పెట్రోల్నింపుకొని రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆటోలో గుడిపల్లికి వెళ్లారు. రమేశ్, సమ్మయ్యలు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంట్లో ఉన్న రాజలక్ష్మి(42), ఆమె భర్త శివయ్య(48), శాంతయ్య(57), ఆమె అక్క కూతురు నమిలికొండ మౌనిక(24), ఆమె ఇద్దరు పిల్లలు ప్రశాంతి(3), హిమబిందు(ఏడాదిన్నర) సజీవ దహనమయ్యారు. రాజ్యలక్ష్మి, శివయ్యల కొడుకు ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్ మహాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను పట్టుకునేందుకు 16 స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. మంగళవారం పారిపోవడానికి ప్రయత్నిస్తున్న లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సృజన, అంజయ్యలను ఎస్సై మానస శ్రీరాంపూర్‌లో పట్టుకున్నారు.
అంత్యక్రియలు చేసిన సీపీఐ
శాంతయ్య అంత్యక్రియలను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాంతయ్య భార్య సృజన, మామ అంజయ్య పరారీలో ఉండగా, ఇద్దరు కొడుకులు హైదరాబాద్‌లో, కూతురు గోదావరిఖనిలో ఉన్నారు. పోస్టుమార్టం తర్వాత మార్చురీలో నాలుగురోజులుగా భద్రపర్చిన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీపీఐ ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.