నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌‌‌‌ హత్య.. చోద్యం చూస్తూ.. సెల్‌‌‌‌ఫోన్లలో చిత్రీకరించిన జనాలు !

నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌‌‌‌ హత్య.. చోద్యం చూస్తూ.. సెల్‌‌‌‌ఫోన్లలో చిత్రీకరించిన జనాలు !
  • ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్‌‌‌‌ ప్రకటించిన పోలీసులు
  • అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ అంత్యక్రియలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ నగరంలో సీసీఎస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ను హత్య చేయడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్‌‌‌‌, ఎస్సై విఠల్‌‌‌‌ను గాయపరిచిన రియాజ్‌‌‌‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనను సీరియస్‌‌‌‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య నిందితుడు రియాజ్‌‌‌‌ అరబ్‌‌‌‌ను పట్టుకునేందుకు ఎనిమిది స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌లను రంగంలోకి దింపారు. 

రియాజ్‌‌‌‌నగరం నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నాకాబందీ నిర్వహిస్తూ, పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీకి పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగగా, మల్టీజోన్–​-1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, సీపీ సాయిచైతన్య హాజరయ్యారు.

ఛాతీలో పొడిచి పరార్..

కానిస్టేబుల్​గా పని చేసే తన అన్న నర్సింగ్​ కూతురు అపెండిసైటిస్​ ఆపరేషన్​ చేయించుకొని నగరంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ఉండగా, ఆమెను పరామర్శించడానికి శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఆకాశ్​తో కలిసి బైక్​మీద బయలుదేరాడు. అదే టైంలో రౌడీ రియాజ్​ అరబ్​ సమాచారం రావడంతో, మేనల్లుడితో కలిసి ఖిల్లా ఏరియాకు చేరుకున్నాడు. విషయాన్ని సీసీఎస్​ ఎస్సైలు విఠల్, భీంరావ్​కు తెలియజేసి, నిందితుడి కోసం వెతుకుతుండగా మురికి కెనాల్  దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా, అదే కాలువలో దూకి ప్రమోద్​ అతడిని పట్టుకున్నాడు.

 నిందితుడి స్కూటీపైనే మధ్యలో కూర్చోబెట్టుకొని సీసీఎస్​ స్టేషన్​కు తీసుకెళ్తూ హత్యకు గురయ్యాడు. ప్రమోద్​ ఛాతీలో కత్తితో పొడవగా, మేనల్లుడు ఆకాశ్​ ఆపేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేశాడు. వారి వెనకాలే బైక్​పై వచ్చిన ఎస్సై విఠల్​ను అదే కత్తితో గాయపర్చి పరారయ్యాడు.  మరో ఎస్సై భీంరావ్​ అక్కడికి చేరుకొని ఈ విషయాన్ని ఆఫీసర్లకు చేరవేశాడు.

రియాజ్‌‌‌‌పై 37 కేసులు

కానిస్టేబుల్ ను​ హత్య చేసిన రియాజ్​ అరబ్​పై నిజామాబాద్​ జిల్లాలో 37 కేసులు ఉన్నాయి. వెహికల్స్​  చోరీ, దొంగతనం, చైన్​ స్నాచింగ్, మర్డర్​ కేసులు ఉండగా, బెయిల్​పై రిలీజై​ నేరాలు చేస్తున్నాడు. నగరంలో వరుస బైక్​ చోరీల​కేసు దర్యాప్తును సీసీఎస్​కు అప్పగించగా, రియాజ్ ను​ పట్టుకున్న ప్రమోద్​ అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. రియాజ్​ జాడ తెలిపిన వారికి రూ.50 వేల క్యాష్​ అవార్డు​ప్రకటిస్తూ సీపీ సాయిచైతన్య వాంటెడ్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. 

ఎంపీ సంతాపం..

కానిస్టేబుల్​ మృతి పట్ల ఎంపీ అర్వింద్​ విచారం వ్యక్తం చేశారు. ఒక రౌడీ చేతిలో కానిస్టేబుల్​ హత్యకు గురికావడం బాధాకరమన్నారు. నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్  చేశారు. ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ఈ ఘటనను ఖండించారు.

చోద్యం చూస్తూ సెల్‌‌‌‌ఫోన్లలో చిత్రీకరించిన జనాలు

రౌడీ రియాజ్​ అరబ్​​కత్తితో దాడి చేస్తున్న టైంలో రోడ్​పై వెళ్తున్న వారు నిలువరించే ప్రయత్నం చేయలేదు. డయల్​ 100కు కూడా ఫోన్​ చేయలేదు. దూరం నుంచి తమ సెల్​ఫోన్లలో ఈ ఘటనను వీడియో తీశారు. రక్తం మడుగులో కుప్పకూలిన కానిస్టేబుల్ ​ప్రమోద్,​ అతని మేనల్లుడు ఆకాశ్, ఎస్సై విఠల్‌‌‌‌ను హాస్పిటల్‌‌‌‌కు తరలించేందుకు మరో ఎస్సై భీంరావ్​ఆటోలను ఆపినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనిపై సీపీ సాయిచైతన్య మండిపడ్డారు. పోలీసులకు ఆపద వస్తే ఇలాగే ప్రవర్తిస్తారా ? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించారు.