ఫోన్ ట్యాపింగ్ కేసు..పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు..పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు
  • చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి
  • రహస్య ప్రాంతంలో విచారణ
  • ఎస్ఐబీలో విధులపై ఆరా
  • నేడు రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్  కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అత్యంత కీలకమైన ఎస్ఐబీ కేంద్రంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రణీత్ రావును విచారించేందుకు వారం రోజుల పాటు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

మొదటి రోజు విచారణలో భాగంగా చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడిని ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్  వెంకటగిరి ఆధ్వర్యంలో నిందితుడిని స్పెషల్  టీమ్  ప్రశ్నించింది. ప్రణీత్  రావుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఆరా తీశారు.

నల్లగొండలో ఎస్ఐగా చేరిన తరువాత ఎలాంటి విధులు నిర్వహించారో సమాచారం సేకరించారు. అప్పట్లో ఒక కేసు విషయంలో ఆయన సస్పెండ్  అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్  మాజీ చీఫ్  ప్రభాకర్ రావుకు, ప్రణీత్ రావుకు మధ్య ఉన్న పరిచయం పైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ లో కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో జాయిన్  అయిన తరువాత ఆయనకు అప్పగించిన టాస్క్  గురించి ఆరా తీశారు. మావోయిస్టులు, టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం గురించి ప్రశ్నించారు.

ఏసీపీ వెంకటగిరికి గతంలో కౌంటర్  ఇంటెలిజెన్స్ లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు ఎలా సేకరించాలో ఆయనకు తెలుసు. ఈ క్రమంలోనే ఎస్ఐబీలో ప్రణీత్ రావు నిర్వహించిన విధులు, పరిమితులకు సంబంధించిన వివరాలతో నిందితుడి స్టేట్ మెంట్  రికార్డు  చేశారు. రెండో రోజు విచారణలో భాగంగా సోమవారం కీలక వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి. బేగంపేటలోని ఎస్ఐబీ లాగర్ రూమ్ కు ప్రణీత్ రావును తీసుకెళ్లి విచారించవచ్చు.