ఆదిలా బాద్ జిల్లాలో ఎన్నికల వార్తల పై నిఘా.. సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ఫోకస్

ఆదిలా బాద్ జిల్లాలో  ఎన్నికల వార్తల పై నిఘా.. సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ఫోకస్
  •     తప్పుడు సర్వేలు, నాయకులపై విమర్శలు చేస్తే చర్యలు 
  •     స్పెషల్ నిఘా సెల్ ఏర్పాటు

ఆదిలాబాద్/ నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్​లో ఎన్నికలు జరుగునున్నాయి. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్ల సెంటర్ల వద్ద అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలపై సోషల్ మీడియాలో చేసే పోస్టులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

‘మేం గెలుస్తున్నాం.. ప్రత్యర్థి ఓడిపోతున్నాడు’, ‘గెలుపు గుర్రాలు వీరే.. వారు ఓడిపోతున్నారు’ లాంటి పోస్టులు, ప్రత్యర్థులను కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రకటనలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం చట్టరీత్య నేరం అని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులు స్పెషల్ నిఘా సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. 

సర్వేలపై ఫోకస్

సోషల్ మీడియాలో పోస్టులపై ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సై స్థాయి అధికారితో స్పెషల్ నిఘా సెల్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాను వీరు నిరంతరం పర్యవేక్షించనున్నారు. సర్వేల పేరుతో గెలుపోటములపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అధికారుల అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దంటున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘిస్తే ప్రజాప్రతినిధుల చట్టం, ఐపీసీ, ఐటీ యాక్ట్ ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

డీపీఆర్​వో కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల్లో వచ్చే రాజకీయ వార్తలపై పటిష్ట నిఘా ఉంచేందుకు నిర్మల్​ కలెక్టరేట్​లో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు. డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (మీడియా సెంటర్)ను గురువారం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజువారీగా వార్త పత్రికలు, లోకల్ చానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు. అనుమానిత పెయిడ్ న్యూస్ వివరాలు నమోదు చేయాలన్నారు. సోషల్​మీడియాలో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.