ట్రాక్టర్ ర్యాలీకి పోలీసుల పర్మిషన్!

ట్రాక్టర్ ర్యాలీకి పోలీసుల పర్మిషన్!
  • 26న 100 కీ.మీ. ర్యాలీ తీస్తామన్న రైతు సంఘాల లీడర్లు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున తాము తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారని రైతు సంఘాలు వెల్లడించాయి. శనివారం పోలీసులతో భేటీ తర్వాత రైతు నాయకుడు అభిమన్యు కొహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఘాజీపూర్, సింఘు, టిక్రి బార్డర్ల నుంచి ట్రాక్టర్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది’ అని అన్నారు. ట్రాక్టర్ ర్యాలీలో వేలాది రైతులు పాల్గొంటారని మరో రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. బారికేడ్లు తొలగించి ట్రాక్టర్ ర్యాలీతో ఢిల్లీలోకి ఎంటర్ అవుతామన్నారు. ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇవ్వరాదని, హింసాత్మకంగా మారే చాన్స్ ఉందని కొందరు మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశా రు. అయితే తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామని, ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ బార్డర్లలో దాదాపు 2 నెలలుగా పంజాబ్, హర్యానా, యూపీ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.  శుక్రవారం కేంద్రం, రైతుల మధ్య జరిగిన 11 దఫా చర్చలు ఫెయిల్ అయ్యాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టడంతో చర్చలు ఓ కొలిక్కి రాలేదు.

ర్యాలీలో అల్లర్లకు కుట్ర: సంఘాల ఆరోపణ

ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లు సృష్టించాలని, నలుగురు రైతు నాయకులను చంపాలని కుట్ర జరుగుతోందని రైతు సంఘాలు ఆరోపించాయి. సింఘు బార్డర్ లో అనుమానితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. అగ్రి చట్టాలపై రైతులు ఆందోళనను అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రెస్​మీట్​లో నిందితుడు కూడా కుట్ర ఆరోపణలను అంగీకరించాడు. ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కాల్పులు జరిపి అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు. శనివారం స్టేజ్ పై ఉన్న నలుగుర్ని కాల్చి చంపాలని అనుకున్నామని, ప్రదీప్ సింగ్ అనే పోలీస్ తమకు ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్పాడు. రైతులు అప్పగించిన 21 ఏళ్ల వ్యక్తి సోనిపత్​కు చెందినవాడని, అతనిపై  క్రిమినల్ రికార్డులేవీ లేవని పోలీసులు చెప్పారు. ‘నిందితుడి దగ్గర ఎలాంటి వెపన్స్ లేవు. కుట్రకు సంబంధించిన ఆధారాలు దొరకలే’ అని చెప్పారు. తర్వాత నిందితుడు మాటమార్చాడు. రైతులు రాసిచ్చిన స్క్రిప్టునే మీడియా ఎదుట చదివానని తెలిపాడు.

For More News..

కేసీఆర్‌‌ అంటే.. ‘కిలాడి చంద్రశేఖర రావు’