
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో పోలీసులు స్పందిస్తున్నరు . టెక్నాలజీ అప్ డేట్ అవుతున్న కొద్దీ సేవలను అందిస్తూ జనానికి మరింత దగ్గరవుతున్నారు. స్మార్ట్ పోలీసింగ్ తో భేష్ అనిపించుకుంటున్నరు. యాప్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉంటూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. దీంతో జనంలోనూ పోలీసులపై నమ్మకం పెరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా కంప్లయింట్స్ ఇస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా కంప్లయింట్ చేస్తే చాలు పోలీసులు ఆ పోస్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత కంప్లయింట్ ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ స్టేషన్ పోలీసులను అలర్ట్ చేస్తున్నారు. కంప్లయింట్ చేసిన క్షణాల్లోనే పోలీసులే బాధితులకు ఫోన్ చేసి సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా ను వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ చేయడం ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుంది.
ఒక్క క్లిక్ తో …
సోషల్ మీడియాలో వచ్చే కంప్లయింట్ పై ప్రత్యేకంగా టీమ్‌లు పని చేస్తున్నాయి. జనం నుంచి వచ్చే ఏ ఫిర్యాదైనా సరే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరవేస్తున్నారు. పైగా ఈ కంప్లయింట్స్ ను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు
మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్క క్లిక్ తో సిటిజన్స్ చేసే కంప్లయింట్లు డీజీ స్థాయి అధికారి నుంచి ప్యాట్రో, బ్లూ కోల్డ్ సిబ్బందికి నిమిషాల్లో చేరుతున్నాయి. కొన్ని కంప్లయింట్స్ కు సంబంధించి హయ్యర్ అఫిషియల్స్ తో మాట్లాడి ఆన్ లైన్ లో సమస్యను పరిష్కరిస్తున్నారు. బాధితులే కాకుండా వారి తరఫున కూడా కొంతమంది సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.
టీఎస్ కాప్ యాప్‌తో క్రైమ్ స్టడీస్
సోషల్ మీడియా ద్వారా క్రైమ్స్ ను కూడా నియంత్రిస్తున్నారు. టీఎస్ కాప్ యాప్ తో రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ అప్ డేట్స్ ను పోస్ట్ చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ ను టీఎస్ కాప్‌తో లింక్ చేస్తున్నారు. దీంతో స్పాట్ నుంచి అప్‌లోడ్ అయ్యే వీడియోలు, ఫొటోల ఆధారంగా క్రైమ్ స్టేటస్, నేరం జరిగిన తీరును పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుల నేర ప్రవృత్తిని గుర్తించి కేస్ స్టడీస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నేరాలు జరిగిన ప్రాంతాలు, క్రైమ్ మోడస్ ఆపరెండితో క్రిమినల్స్ ను గుర్తిస్తున్నారు. ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, నేరాలకు సంబందించిన సమాచారం పోస్ట్ చేస్తున్నారు. ఇలా అందిన ఫిర్యాదులతో స్థానిక పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్ఐఆర్,పెటి కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు కమిషనరేట్లలో 33, 547 కంప్లయింట్స్
సోషల్ మీడియా ద్వారా గతేడాది మూడు కమిషనరేట్లలో మొత్తం 33, 547 కంప్లయింట్స్ వచ్చాయి. వీటిలో చాలా సాల్వ్ అయ్యాయి. స్టేషన్ కు వెళ్లకుండా ఎక్కడున్న సరే కంప్లయింట్ చేసే అవకాశం ఉండడంతో చాలా మంది ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హాక్ ఐతో పాటు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా భారీగా కంప్లయింట్లు పెరిగాయి. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా షీ టీమ్స్ కు కంప్లయింట్స్ వస్తున్నాయి. బాధిత మహిళలు స్టేషన్ కు వచ్చేందుకు భయపడుతుండడంతో ఒక్క మేసేజ్ తో వాళ్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది అత్యధిక కంప్లయింట్స్ వచ్చాయి. పోలీసులు కూడా సోషల్ మీడియాలో కంప్లయింట్లు చేయాలంటూ జనానికి సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన హాక్‌ఐ యాప్‌ను14 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకోవటం విశేషం. యాప్ ద్వారా 12 రకాల సర్వీసులను అందిస్తున్నారు.