రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులు

రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులు

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌ రీజియన్‌లోని హృదయాపూర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో క్రూడ్ బాంబులు కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులను రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. భారత్ బంద్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. ఆందోళనలో ఎవరైనా అల్లరి మూకలు చేరి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా..

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బుధవారం దేశ వ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ సార్వత్రిక సమ్మె తీవ్రంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం నార్త్ 24 పరగణాస్ రీజియన్‌లోని కంచ్రాపారా, హౌరా స్టేషన్ల వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన నిరసనకారులు పట్టాలపై రైలు రోకో చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు బస్సులపై రాళ్లతో దాడి చేశారు. ఇటువంటి పరిస్థితిని ముందుగానే ఊహించి కొన్ని డిపోల బస్సు డ్రైవర్లు హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఏపీ, ఒడిశాల్లోనూ ఉదయమే వామపక్ష నేతలు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. డిపోల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.