రాంజీ నగర్ గ్యాంగ్ : ఆ ఖతర్నాక్ దొంగలు వీళ్లే

రాంజీ నగర్ గ్యాంగ్ : ఆ ఖతర్నాక్ దొంగలు వీళ్లే

హైదరాబాద్ : లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్న రాష్ట్ర పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠాలు సవాల్ విసురుతున్నాయి. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా డోంట్ కేర్ అంటూ వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం.. తిరుచ్చిలోని రాంజీనగర్ గ్యాంగ్.

ఇందులో వనస్థలిపురంలో మంగళవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ క్యాష్ చోరి కేసుతో రాంజీనగర్ గ్యాంగ్,నగరి గ్యాంగ్ పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి.ఈ కేసులో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కస్టోడియన్ల నుంచి రూ.50.97లక్షల క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్ళిన ముఠా తమిళనాడుకు చెందిన రాంజీనగర్ గ్యాంగ్ గా పోలీసులు నిర్ధారించారు. ఈ గ్యాంగ్ కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 8 స్పెషల్ టీమ్స్ తో పోలీసులు గాలిస్తున్నారు.

వనస్థలిపురం చోరీలో పాల్గొన్న దొంగల గ్యాంగ్  ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

రాంజీనగర్ గ్యాంగ్ ఇలా చేస్తుంది

తమిళనాడుకు చెందిన రాంజీనగర్ ముఠా దృష్టి మరల్చి దొంగతనాలు చేయడంలో అందె వేసిన చేయి. రాంజీనగర్ కు చెందిన ముఠాలు దేశంలోని మెట్రో నగరాలనే టార్గెట్ చేస్తాయి. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద డబ్బు,బంగారు వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడతాయి. తాము చోరీల కోసం సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు రెక్కీ నిర్వహిస్తాయి. బ్యాంకుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫోకస్ పెడతాయి. ఇందులో ఆరుగురు సభ్యులకు తగ్గకుండా స్కెచ్ వేస్తాయి. బ్యాంకులో డబ్బు డ్రా చేసే వారికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి వారి కదిలికలను బ్యాంక్ బయట ఉన్న ముఠా సభ్యులకు చేరవేస్తాయి. అందుకోసం బ్యాంకు లోపల ఇద్దరు బయట ఇద్దరు బాధితులను ఫాలో చేసేందుకు మరో ఇద్దరు గ్యాంగులుగా విడిపోతారు.

బ్యాంకుల నుంచి క్యాష్ తో బయటకు వచ్చిన వారిని వెంబడిస్తారు. అదును చూసి రూ.50 లేదా రూ.100లను తాము టార్గెట్ చేసిన వారి ముందు జారవిడుస్తారు. డబ్బులు కింద పడిపోయాయని చెప్తారు. ఇలా దృష్టి మరలించి బాధితుల చేతిలోని క్యాష్ బ్యాగులతో ఈ గ్యాంగ్ ఉడాయిస్తుంది. ఆ తరువాత తమతో తెచ్చుకున్న వాహనాల్లో కాకుండా ఆటోలు,ఆర్టీసీ బస్సుల్లో రాంజీ గ్యాంగ్ స్పాట్ నుంచి ఎస్కేప్ అవుతుంది. పోలీసులు అలర్ట్ అయ్యే లోపు సిటీ విడిచి పారిపోతుంది. ఇలా దృష్టి మరల్చి చోరీలు చేసే రాంజీనగర్ ముఠాపై దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ ముఠాగా రాంజీనగర్ గ్యాంగ్ పోలీస్ రికార్డుల్లోకి ఎక్కింది.