
సంతకం ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనకు CRPC 41, 160 కింద నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదు. దీంతో.. రవిప్రకాశ్ ను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అతని కోసం.. సైబరాబాద్ ఎస్వోటీ, సైబర్ క్రైమ్ , బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్, ముంబై, హైదరాబాద్ లో వెతుకున్నారు.
రవిప్రకాశ్ మొబైల్ స్విచ్ఛాఫ్ లో ఉందని.. కుటుంబసభ్యులు, స్నేహితులతో కూడా ఆయన టచ్ లో లేరని పోలీసులు చెప్తున్నారు. ఇదే కేసులో.. రవిప్రకాశ్ తో పాటు నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కూడా పరారీలోనే ఉన్నాడు.
టీవీ9 చానెల్ నిర్వహణని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా, కుట్రతో సంతకం ఫోర్జరీతో పాటు నకిలీ పత్రాలు సృష్టించారంటూ.. రవిప్రకాశ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. రవిప్రకాశ్ టీవీ9 చానెల్ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారని బంజారాహిల్స్ పీఎస్ లో తాజాగా మరో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రవిప్రకాశ్ పై ఐపీసీ 457,420, 409, 406, 20బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీవీ9 గ్రూప్ లోని మొత్తం 6 లోగోలను మౌఖిక ఒప్పందం ద్వారా అక్రమంగా, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే దురుద్దేశ్యంతోనే అమ్మినట్లు కౌశిక్ రావు ఫిర్యాదులో తెలిపారు. గతేడాది మేలో.. ఈ లోగోలను రవిప్రకాశ్ తన సన్నిహితుని మీడియా కంపెనీకి అమ్మారన్నారు. మెజారిటీ వాటాదారులకు సమాచారం ఇవ్వకుండా, నిబంధనల్ని పాటించకుండా లోగోని అమ్మడం.. కంపెనీని చీట్ చేయడం కిందకే వస్తుందని టీవీ9 డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదులో తెలిపారు. తక్షణమే రవిప్రకాశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.