ఇటుకల చాటున గంజాయి తరలింపు

ఇటుకల చాటున గంజాయి తరలింపు

నస్పూర్/కోల్​బెల్ట్, వెలుగు : ఇటుకల చాటున అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్​బోల్తా పడడంతో ఈ అక్రమ రవాణా బాగోతం బయటపడింది. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు సిమెంటు, ఇటుకల బస్తాల్లో గంజాయిని దాచారు. ఆ సరుకును ట్రాక్టర్​లో చెన్నూరు మార్గంలో మంచిర్యాల వైపు తరలిస్తున్నారు. అయితే, ఆ ట్రాక్టర్  శ్రీరాంపూర్– ​సింగరేణి జీఎం ఆఫీసు​సమీపంలోని నేషనల్​హైవే పక్కన బోల్తా పడింది. 

దీంతో నిందితులు ఆ వాహనాన్ని విడిచి పారిపోయారు. సిమెంటు, ఇటుకల లోడ్ కావడం, వర్షం కురవడంతో మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక శ్రీరాంపూర్​ పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపించారు. దీంతో ఇటుకలతో పాటు కవర్​చుట్టి ఉన్న కొన్ని బస్తాలు బయటపడ్డాయి. వాటిని తెరిచిచూడగా గంజాయిగా తేలింది. ఆ గంజాయి మొత్తం 5 క్వింటాళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ట్రాక్టర్, గంజాయి బస్తాలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. ట్రాక్టర్​కు ఎలాంటి నంబర్​ లేకపోవడంతో పక్కా ప్లానింగ్​తోనే నిందితులు గంజాయిని తరలిస్తున్నారని, ఛత్తీస్​గఢ్​నుంచి సరుకును తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎరున్నారనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నేషనల్​ హైవే మార్గంలోని సీసీటీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నామని  శ్రీరాంపూర్​ ఎస్సై రాజేశ్​ తెలిపారు.