
నస్పూర్, వెలుగు: సింగరేణి గని కార్మికులకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని టీబీజీకేఎస్ నాయకులు విమర్శించారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నా సింగరేణి ఇప్పటివరకు లాభాల వాటా ప్రకటించకపోవడం గుర్తింపు, ప్రతినిథ్య సంఘాల అసమర్థతేనని విమర్శించారు. కార్మికులను మోసం చేసేందుకు చూస్తున్నామని మండిపడ్డారు. నికర లాభాలు ప్రకటించిన తర్వాతే ఖర్చు పెట్టాలని, గతేడాది వచ్చిన లాభాలపై ఆడిట్ షీట్ బయటపెట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ బయపెట్టలేదన్నారు.
మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం దారుణమన్నారు. వేలంపాట లేకుండా గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన విధంగానే తెలంగాణకు కూడా ఇవ్వాలన్నారు. వారసత్వ ఉదోగుల లెటర్లు ఏ ఏరియావి అక్కడే అందించాలని కోరారు. ఏజ్ పెంపు నిబంధనలు సవరించాలని, క్లరికల్ పోస్టులకు కోసం ఇంటర్నల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బండి రమేశ్, పి.సత్తయ్య, పి.రమేశ్, అన్వేశ్ రెడ్డి, ఎండీ లాల్, కేంద్ర నాయకులు గొర్ల సంతోష్, వెంగళ కుమారస్వామి, డి.రమేశ్, పి.వినయ్ తదితరులు పాల్గొన్నారు.