
గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితులను కటకటాలకు పంపుతున్నారు. ఇటీవల దొరికిన గంజాయి నిల్వలను గురువారం (సెప్టెంబర్ 11) నల్గొండ పోలీసులు కాలబెట్టారు. సీజ్ చేసిన 52 లక్షల రూపాయల విలువైన 207.056 కేజీల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో దగ్ధం చేశారు ఎస్పీ శరత్ చంద్ర పవార్.
మాధక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చటమే లక్ష్యంగా జిల్లా పోలీసుల కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు హెచ్చరించారు. అక్రమ గంజాయిపై నిరంతర నిఘా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 18 కేసులలో 207.056 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా 118 గంజాయి చెట్లు, 173 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన గంజాయి నిల్వలను కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావసాలకు దూరంగా నిర్వీర్యం చేసినట్లు తెలిపారు.
యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు ఎస్పీ. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
టోల్ ఫ్రీ నెం. 8712670266.