ఎస్సై నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

ఎస్సై నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారిచేసిన ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ ఉద్యోగానికి నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని అర్హతలున్నా కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని    హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్సై నియామక ప్రక్రియను  నిలిపివేస్తూ స్టే విధించింది.  

అయితే ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని... అన్ని అర్హతలున్నా తమను అనర్హులుగా ప్రకటించారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ పిటిషన్ న్యాయస్థానం ముందుకురాగా ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ వాదించారు. ముఖ్యంగా ఎత్తు అంశంలో కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టు ద‌ృష్టికి తీసుకువచ్చాడు పిటిషనర్ తరపు న్యాయవాది.  గతంలో ఎత్తు అంశంలో అర్హత సాధించిన వారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇదెలా సాధ్యమని రిక్రూట్ మెంట్ బోర్డుని ప్రశ్నించారు న్యాయమూర్తి. అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది కాబట్టి వెంటనే ఈ ఎస్సై నియామక ప్రక్రియను నిలిపివేయాలని న్యాయవాది శ్రావణ్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఎస్సై నోటిఫికేషన్ పై స్టే విధించింది. విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం తర్వాత నిర్ణయం వెలువడేవరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు సూచించింది. హైకోర్టు నిర్ణయంతో ఎస్సై ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీస్ శాఖలో ఎస్సైల కొరత వుంది. దీంతో 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించింది. అనంతరం ఈ సెప్టెంబర్ లో అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులను కూడా నిర్వహించారు. ఇందులో అర్ఘత సాధించినవారికి అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.