
- పరారీలో మరో నిందితుడు
- మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ
మలక్ పేట, వెలుగు: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చందూ నాయక్ (48) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి తండాకు చెందిన కేతావత్ చందూ నాయక్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండగా.. జనగామ జిల్లా కడవెండికి చెందిన రాజేశ్ అలియాస్ రాజన్న సీపీఐ (ఎంఎల్) రెడ్ ఫ్లాగ్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పలు ఆర్థిక, భూ ఆక్రమణ కార్యకలాపాలు నిర్వహించారు.
2022లో రాజన్న, చందూ నాయక్, మరికొందరు నేతలు కలిసి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని కుంట్లూరులో 100 ఎకరాల భూదాన్ భూముల్లో 1,300 గుడిసెలు వేయించి, గుడిసె వాసుల నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.13 లక్షలు వసూలు చేశారు. అదే విధంగా బాల్‌రెడ్డి అనే బిల్డర్ వద్ద చందూ నాయక్బామ్మర్దికి రావాల్సిన రూ.12 లక్షల సెటిల్మెంట్లో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం వారి మధ్య రాజీ కుదుర్చింది. ఇదిలాఉండగా.. రాజన్న ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండగా.. చందూ నాయక్ రాజన్న భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. దీంతో రాజన్న కక్ష పెంచుకొని, తన భార్యకు చందూ నాయక్ తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతన్ని హతమార్చాలని ప్లాన్ వేశాడు.
ఐదుగురితో కలిసి హత్యకు ప్లాన్
చందూ నాయక్ హత్య కోసం కర్మన్ ఘాట్ కు చెందిన ఏడుకొండలు, ప్రజా పార్టీ సభ్యుడు శ్రీను, నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున జ్ఞాన ప్రకాశ్, రాంబాబు, యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ కు చెందిన కందుకూరి ప్రశాంత్‌తో రాజన్న ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ఉప్పల్ భగాయత్ లో ఒక రూమ్ రెంట్‌కు తీసుకొని కొన్ని రోజులపాటు రెక్కీ నిర్వహించారు. మలక్‌పేటలోని శాలివాహన నగర్ పార్క్ ను హత్యకు అనువైనదిగా గుర్తించారు. 15న ఉదయం 7 గంటలకు వాకింగ్ కోసం పార్కుకు వచ్చిన చందూ నాయక్ ను ఫాలో అవుతూ కారులో వేటకొడవళ్లు, తుపాకులతో మాటువేసి కూర్చున్నారు. వాకింగ్ తర్వాత ఇంటికి వెళ్తున్న చందూ నాయక్ కళ్లల్లో కారంపొడి కొట్టడంతో మంటతో పరుగులు తీసిన ఆయన.. పార్కు గేటు వద్ద ఇసుకలో జారిపడగా, దుండగులు తుపాకులతో 8 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దాంతో చందూ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్పాట్‌కు చేరుకున్న మలక్ పేట పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఈ నెల 18న నెల్లూరు జిల్లా కావలిలో అర్జున జ్ఞాన ప్రకాశ్, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 19న రాజేశ్, ప్రశాంత్, ఏడుకొండలును జనగామ వద్ద అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శ్రీను పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.