25 ఏండ్ల తర్వాత మర్డర్​ కేసు ఛేదించిన పోలీసులు

25 ఏండ్ల తర్వాత మర్డర్​ కేసు ఛేదించిన పోలీసులు
  • ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నటిస్తూ హంతకుడి కోసం వేట
  • 25 ఏండ్ల తర్వాత మర్డర్​ కేసు ఛేదించిన పోలీసులు
  • యూపీలో నిందితుడిని పట్టుకున్న ఢిల్లీ కాప్స్ 

న్యూఢిల్లీ: ఓ మర్డర్ కేసును ఢిల్లీ పోలీసులు పాతికేండ్ల తర్వాత ఛేదించారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నటిస్తూ ఉత్తరప్రదేశ్​లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సినిమా కథను తలపించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 1997 ఫిబ్రవరిలో ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఏరియాలో కిషన్ లాల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడు. అదే ఏరియాలోనే రాము అనే కూలీ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. కానీ అతని ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇలాంటి కేసులను హ్యాండిల్ చేయడంలో పేరు పొందిన నార్త్ డిస్ట్రిక్ట్ లోని ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారులు ఈ కేసును అప్పగించారు. ఏసీపీ ధర్మేందర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్ పెక్టర్ సురేందర్ సింగ్, ఎస్ఐ యోగేందర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్స్ పునీత్ మాలిక్, ఓంప్రకాశ్ టీంగా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు  ప్రారంభించారు. పోలీసులు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నటిస్తూ మొదట ఢిల్లీలోని ఉత్తమ్ నగర్​కు, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్​లోని ఫరూకాబాద్ జిల్లాలో ఖాన్ పూర్ గ్రామానికి వెళ్లారు. రెండుచోట్లా రాము బంధువులను కలిసి మాట్లాడారు. దీంతో రాము కొడుకు ఆకాశ్ మొబైల్ నంబర్ దొరికింది. దాని సాయంతో  విచారిస్తూ యూపీలోని కపుర్తలలో ఉంటున్న ఆకాశ్ ను కలిసి అతని తండ్రి రాము గురించి ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం తన తండ్రి లక్నోలోని జానకిపురంలో ఈ–రిక్షా నడుపుతున్నట్లు ఆకాశ్ వెల్లడించాడు.

ఈ-రిక్షా ఏజెంట్లుగా నటించి పట్టుకున్నరు

పోలీసులు ఈ–రిక్షా ఏజెంట్లుగా నటిస్తూ జానకిపురం వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఈ–రిక్షాలపై కొన్ని సబ్సిడీలు ఇస్తోందని అక్కడ కొంతమంది డ్రైవర్లను సంప్రదించారు. వారిలో ఒకరు అశోక్ యాదవ్ (ఇతనే నిందితుడు రాము. అశోక్ యాదవ్​గా పేరు మార్చుకున్నాడు) గురించి వెల్లడించాడు. దీంతో పోలీసులు ఈ నెల 14న అశోక్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కిషన్ లాల్​ను చంపింది తానే అని అశోక్ యాదవ్ అలియాస్ రాము ఒప్పుకున్నాడు.